వనపర్తి: ఒక చిన్న నిర్లక్ష్యం కారణంగా ఒకే గ్రామంలో 110 మంది కరోనా బారీన పడ్డారు. ఈ సంఘటన వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడలో కలకలం రేపింది. గ్రామస్థులు తెలపిన వివరాల ప్రకారం.. 5 రోజుల క్రితం ఒక వ్యక్తి నుంచి గ్రామస్థులు పింఛన్లు తీసుకున్నారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఒకరు 4 రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలడంతో అప్రమత్తమైన అధికారులు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. కుటుంబంలోని మరో 9 మందికి కరోనా పాజిటివ్ రావడంతో ముందు జాగ్రత్తలో భాగంగా పింఛన్లు స్వీకరించిన వారితోపాటు గ్రామంలోని 392 మందికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించగా అందులో 110 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం వారందరినీ హోం క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇకనైనా మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించినట్లైతే ఇంత మందికి కరోనా బారీన పడే వారు కాదని వైద్య అధికారులు పేర్కొనడం అందరూ ఆలోచించదగ్గ విషయం.