కొత్తగా గ్యాస్ కనెక్షన్ కావాలనుకునేవారికి ఇది శుభవార్తే. కనెక్షన్ కోసం ఇకపై కాళ్లరిగేలా గ్యాస్ డిపోల చుట్టూ తిరిగే బాధ తప్పినట్టే.
ఒకే ఒక్క మిస్డ్‌కాల్‌తో ఇండేన్ నుంచి కొత్త కనెక్షన్ పొందే సౌకర్యాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తీసుకొచ్చింది.
ఇందుకోసం 84549 55555 నంబరును ప్రారంభించింది.
ఈ నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కొత్త కనెక్షన్‌ను బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది.
ఈ మేరకు ఐవోసీ చైర్మన్ ఎస్ఎం వైద్య నిన్న ఈ సేవలను ప్రారంభించారు.
అందుబాటులోకి వచ్చిన కొత్త సేవల ద్వారా డబుల్ బాటిల్ కనెక్షన్ (డీబీసీ)ని కూడా పొందొచ్చు.
ఒక సిలిండర్ కలిగిన వినియోగదారులు ఇంటి వద్దే డీబీసీకి మారొచ్చు.
ఆసక్తి కలిగిన వినియోగదారులు 14.2 కేజీల సిలిండర్‌కు బదులు 5 కేజీల సిలిండర్‌ను కూడా ఎంపిక చేసుకోవచ్చు.
ఈ సదుపాయాన్ని అందిస్తున్న ఏకైక సంస్థ ఐవోసీ ఒక్కటే.
కాగా, వినియోగదారులు తమ నమోదిత ఫోన్ నంబరు నుంచి పైన పేర్కొన్న నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు.
అలాగే, 75888 88814 నంబరుకు వాట్సాప్ ద్వారా కానీ, 77185 55555 నంబరుకు ఎస్సెమ్మెస్, ఐవీఆర్ఎస్ విధానంలో కానీ వినియోగదారులు సిలిండర్ బుక్ చేసుకోవచ్చని ఐవోసీ వివరించింది.