Homeజాతీయం#Criminal #Cases #SupremeCourt : రాజ‌కీయ నాయ‌కుల‌పై కేసులు ఎత్తేయొద్దు

#Criminal #Cases #SupremeCourt : రాజ‌కీయ నాయ‌కుల‌పై కేసులు ఎత్తేయొద్దు

చట్టసభల సభ్యులపై క్రిమినల్‌ కేసులను ఎత్తివేసేందుకు రాష్ర్టాలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులను హైకోర్టు అనుమతి లేకుండా ఉపసంహరించవద్దని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం, సీబీఐ వంటి సంస్థలు తాము అడిగిన నివేదికలను దాఖలు చేయడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

రాజకీయ నాయకులపై క్రిమినల్‌ కేసుల పర్యవేక్షణకు సుప్రీంకోర్టులో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపింది.

ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని 321 సెక్షన్‌ను ఉపయోగించి రాజకీయ నాయకులపై క్రిమినల్‌ కేసులను ఎత్తివేయాలని భావిస్తున్నాయన్న కథనాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఆయా రాష్ర్టాలు పలువురు చట్టసభల సభ్యులపై కేసులను ఉపసంహరించాలన్న నిర్ణయానికి వచ్చాయంటూ ప్రచురితమైన వార్తా కథనాలను అమికస్‌ క్యూరీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో సీఆర్‌పీసీ 321 దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.

హైకోర్టు అనుమతి లేకుండా క్రిమినల్‌ కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించవద్దని ఆదేశించింది.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ జరుగుతున్న ప్రత్యేక కోర్టుల జడ్జిలను బదిలీ చేయవద్దని స్పష్టం చేసింది.

గతంలో తాము అడిగిన నివేదికలను అందజేయడానికి కేంద్రానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చివరి అవకాశం ఇస్తున్నామని తెలిపింది.

తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసుల విచారణను వేగవంతం చేయాలంటూ 2016లో బీజేపీ నాయకుడు, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది.

శిక్ష పడిన రాజకీయ నాయకులు జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కూడా ‘పిల్‌’లో కోరారు.

మొద్దునిద్ర వీడని పార్టీలు

రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా వారిపై ఉన్న క్రిమినల్‌ కేసులను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు అదేశించింది.

రాజకీయ వ్యవస్థను నేర రహితంగా మార్చే దిశగా ఇది కీలక తీర్పు.

బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు 9 పార్టీలు తమ ఆదేశాలను ధిక్కరించాయని సుప్రీంకోర్టు పేర్కొంది.

గత ఏడాది బీహార్‌ ఎన్నికల్లో తమ అభ్యర్థులపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను వెల్లడించనందుకు బీజేపీ, కాంగ్రెస్‌ మరో ఐదు పార్టీలకు రూ.లక్ష చొప్పున, సీపీఎం, ఎన్సీపీలకు రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించింది.

పార్టీలు మొద్దునిద్రను వీడడానికి విముఖంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.

నివేదికలు లీక్‌ అవుతున్నాయి

నివేదికలు లీక్‌ అవుతుండటంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

‘నివేదికలు మాకు చేరకముందే వాటిని మేం వార్తా పత్రికల్లో చదువుతున్నామ’ని వ్యాఖ్యానించింది.

దీనికి ఉదాహరణగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నివేదికను ప్రస్తావించింది.

ఆ నివేదికలో కేసులున్న కొందరు రాజకీయ నాయకుల పేర్లు మాత్రమే ఉన్నాయని, తాము అడిగిన సమాచారం మాత్రం లేదని తెలిపింది.

దీంతో సమగ్ర నివేదిక సమర్పించేందుకు 10 రోజుల గడువు ఇవ్వాల్సిందిగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరారు.

స్పెషల్‌ కోర్టుల్లో సాక్షుల విచారణకు వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యాల ఏర్పాటుకు నిధుల కేటాయింపు అంశంపై కూడా కేంద్రం బదులివ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Recent

- Advertisment -spot_img