Homeఎడిటోరియల్​కాణిపాకానికి ఆ పేరెలా వచ్చింది? గణపతి ఉత్సవాలు ఎందుకు చేసుకుంటారు.. ముస్లింలూ.. మీకు తెలియని ఎన్నో...

కాణిపాకానికి ఆ పేరెలా వచ్చింది? గణపతి ఉత్సవాలు ఎందుకు చేసుకుంటారు.. ముస్లింలూ.. మీకు తెలియని ఎన్నో విషయాలు ఇక్కడ..

know more facts about ganesh utsava festivals : విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. ముల్లోకాలకు ప్రీతిపాత్రుడు. గంభీరమైన రూపం అతనిది.

గణాధిపతిగా కొలువుదీరి.. విఘ్ననాయకుడై వర్ధిల్లుతున్నాడు. ప్రతీ సంవత్సరం.. సకల జనుల పూజలు అందుకుంటాడు.

నవరాత్రి వేడుకలతో లోకంలో భక్తిభావాన్ని పెంపొందిస్తున్నాడు. అలాంటి గణేశుడి గురించి.. వినాయక చవితి గురించి..

గణేశుడితో సంబంధించిన ఆసక్తికర అంశాల గురించి.. పూజ గురించి.. నిమజ్జనం గురించి వివరంగా తెలుసుకొని వినాయక ఉత్సవాలు జరుపుకొందాం.

పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఎకో ఫ్రెండ్లీ గణపతికి ప్రాధాన్యమిద్దాం.

గల్లీకో గణేశుడు.. ఇంటికో వినాయకుడు కాకుండా.. ఊరికొక వినాయకుడిని ప్రతిష్ఠించి పూజిద్దాం.

వక్రతుండ మహాకాయ.. కోటిసూర్య సమప్రభా .. అంటే చాలు, ఆర్తులను అక్కున చేర్చుకొని నిండు ధైర్యాన్ని ఇస్తాడు విఘ్నాధిపతి.

ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరిగేందుకు ఎల్లవేళలా తోడుంటానని అభయమిస్తాడు వినాయకుడు.

అందుకే, ఏ పని అయినా వినాయకుడి పూజతోనే ప్రారంభిస్తాం.

బుద్ధిబలంతో పనిచేస్తే విజయం సాధ్యమని చెప్పడానికి వినాయకుడి జీవితమే ఉదాహరణ.

ఆయన రూపమే భక్తకోటికి పెద్ద పాఠం.గణపతి ప్రథమ దేవుడు. ఏ కార్యానికైనా అవరోధాలను తొలగించి సిద్ధినీ.. బుద్ధినీ ప్రసాదించే దివ్యశక్తినే గణపతిగా ఉపాసించడం వేద ప్రమాణం.

పూజగానీ.. యజ్ఞంగానీ లోకకల్యాణం కోసం చేస్తారు.

ఆరాధించే దేవతా గణానికీ.. మంత్ర సమూహానికీ.. యాజ్ఞికుల బృందానికీ ప్రభువై.. ఫలప్రదాతయై అనుగ్రహించే పరమేశ్వర స్వరూపమే గణపతి అని చెప్పుకొంటారు.

సమస్త చేతన.. అచేతన వర్గాలకు ఆయనే అధిపతి. ప్రతి కార్యారంభంలోనూ విఘ్నేశ్వరపూజ జరిపినప్పటికీ భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రత్యేకంగా పూజిస్తారు.

ఆ రోజే ఎందుకంటే.. అది వినాయకుడు పుట్టినరోజు.. ఇంకా ఆయనకు విఘ్నరాజత్వం సంప్రాప్తించిన రోజు.

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల మహదాదితత్తాలకు ఆయన అధిపతి కాబట్టి, మహాగణపతి అయ్యాడు.

తర్పణ ప్రియుడు

సూర్యుడు నమస్కార ప్రియుడు. విష్ణువు అలంకార ప్రియుడు. గణపతి తర్పణ ప్రియుడు.

గణపతికి ప్రియమైన చతురావృత్తి తర్పణం చేయడం వల్ల ఆయుష్షు, బుద్ధి, యశస్సు, ఐశ్వర్యం, బలం, భుక్తి, ముక్తి, యుక్తి చేకూరుతాయని నమ్మకం.

గణేషుడి దేహం విలక్షణం. బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్న అని ఆయన రూపం బోధిస్తుంది.

వ్రతకథ చదివి, విని అక్షింతలు తలపై వేసుకుంటే ఆ రాత్రి చంద్రుడిని చూసినా నీలాపనిం

దలు కలుగవని భక్తుల నమ్మకం. ఊరంతటికీ ఒక్కడే వినాయకుడు. అదీ కూడా మట్టి వినాయకుడు.

చాలా విచిత్రంగా ఉంది కదూ? విచిత్రమే అయినా.. ఇదొక మంచి కార్యక్రమం. ఇప్పుడు కచ్చితంగా జరగాల్సిన మార్పు.

అందరూ కలిసి ఒకే వినాయకుడికి పూజ చేస్తే ఎంత బాగుంటుంది? ఊళ్లో సోదరభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఇదెక్కడో ఉత్తరాదిన జరుగుతున్న మార్పు కాదు. తెలంగాణ పల్లెల్లో ఇప్పుడిప్పుడే చేతులు కలుపుతూ.. అడుగులు ముందుకు పడుతున్న ఉద్యమం.

రెండేండ్ల కిందటే మంత్రి హరీశ్‌రావు పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామం మొదటగా స్పందించింది.

యువత.. మహిళలు.. రైతులు.. ప్రజాప్రతినిధులు.. అన్ని వర్గాలూ ఒక్కటయ్యారు. సంఘాలు.. యూనియన్లు కూడా ఏక వినాయకుడికే జై కొట్టాయి.

ఏకాభిప్రాయంతో గ్రామంలో ఒకే వినాయకుడిని ప్రతిష్టించి సరికొత్త మార్పునకు నాంది పలికారు గ్రామ ప్రజలు.

వారిని స్ఫూర్తిగా తీసుకొని రాంపూర్‌.. మాచాపూర్‌ బండ.. చెర్లపల్లి.. నారాయణరావు పేట.. కోదండపల్లి గ్రామాల ప్రజలు కూడా తమ ఊళ్లో ఒకే వినాయకుడిని ప్రతిష్ఠిస్తామని తీర్మానం చేశారు.

అంతేకాదు.. వీటికి సంబంధించిన రాతపూర్వక హామీని కూడా ఇచ్చారు.

నిజానికి వినాయక ఉత్సవాల ఉద్దేశం ఏంటి? అని ఆలోచిస్తే.. ఛత్రపతి శివాజీ కాలంలో సంప్రదాయంలో భాగంగా వినాయక ఉత్సవాలను నిర్వహించేవారు.

తర్వాత లోకమాన్య తిలక్‌.. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు గణేశ్‌ ఉత్సవాలు కచ్చితంగా జరగాల్సిందిగా పిలుపునిచ్చారు.

అప్పటి నుంచి ప్రతీ ఊరు.. ప్రతి పల్లె.. ప్రతి వాడలో వినాయకుడి విగ్రహ ప్రతిష్ఠాపనలు.. ఉత్సవాలు.. ఊరేగింపులు జరుగుతూ వస్తున్నాయి.

అయితే తిలక్‌ ఉద్దేశం ఏంటి? వర్గాలు.. గ్రూపులుగా ఉన్న ప్రజలు ఐకమత్యంగా ఉండాలి అనే కదా? కానీ రానురాను గల్లీ గల్లీకి.. ఇంటింటికీ వినాయక విగ్రహాలు ప్రతిష్టించడం మొదలైంది.

దీంతో పర్యావరణంపై దుష్ప్రభావాలు పడ్డాయి. పర్యావరణ ప్రేమికులు ‘ఎకో గణేశుడు ముద్దు.. రసాయనాల వినాయకుడు వద్దు’ అని పర్యావరణం, పండుగలపై మంచి అవగాహన కల్పిస్తూ వస్తున్నారు.

మార్పు మొదలైంది కానీ.. ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది.

ఇప్పుడు కావాల్సింది మట్టి వినాయకుడు ఒక్కటే కాదు.. వినాయక విగ్రహాలను తగ్గించాలి. దాంట్లో భాగమే ఊరికొక వినాయకుడు.

దీంతో పర్యావరణం బాగుంటుంది.. పండుగలూ బాగుంటాయి! ఊరు ఊరంతా మంటపం దగ్గరకు వస్తే… ఆ కోలాహలమే వేరు.

ఊరుమ్మడి జాతరను తలపిస్తుందా ఘట్టం.

గణాధిపతి

ఆయనకు గజాననుడు అనే పేరు పెట్టారు. తర్వాత గణేశుడు.. విఘ్నాధిపత్యం స్వీకరించి భక్తుల మెప్పు పొందాడు.

నైవేద్యంగా పెట్టిన కుడుములు.. ఉండ్రాళ్లు ఆరగించేవాడు. వినాయకుడి మహిమలు ముల్లోకాలకు విస్తరించి సర్వజనులతో కీర్తింప
బడ్డాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటివాడే వినాయకుడిని పూజించేవాడంటే వినాయకుడి శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

మనసులో తలిచిన కార్యాలను వినాయకుడు నెరవేరుస్తాడని దేవతలు నమ్మేవారు.

ఈ గొప్పదనం వల్లనే గణపతిని ‘సిద్ధి వినాయకుడు’ అని పిలిచారు.

బావిలో.. కాణిపాక వినాయకుడు

కాణిపాకం క్షేత్ర సమీపంలో బాహుదానది ప్రవహించేది. దాని ఒడ్డున ఓ బావి ఉండేది.

దాంట్లో వినాయకుడు వెలిశాడనీ.. బావిలో నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడని భక్తుల నమ్మకం.

అప్పుడు చోళరాజుల ఏలుబడిలో ఉండేది ఈ ప్రాంతం. ఆ ఊరిపేరు విహారపురి.

ఆ గ్రామంలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు సోదరులు ఉండేవారు. వారు పుట్టుకతో మూగ.. చెవుడు.. గుడ్డివారు.

ఇన్ని వైకల్యాలున్నా చక్కగా వ్యవసాయం చేసేవారు. స్వయంగా బావి తవ్వి మోట కొట్టి సాగుచేసుకునేవారు.

ఒకసారి వర్షాభావం కారణంగా బావిలో నీళ్లు తగ్గాయి. దీంతో బావి మరింత తవ్వాలని నిర్ణయించుకున్నారు.

తవ్వుతున్నప్పుడు ఠంగ్‌మనే శబ్దం వినిపించింది. పరిశీలిస్తే బావిలో పెద్ద రాయి.

దానిని తొలగించడానికి గడ్డపార దెబ్బ వేయగా దాంట్లో నుంచి రక్తం పైకి ఎగిసింది

. రక్తం ఆ ముగ్గురి స్నేహితులపై పడగానే వారి వైకల్యం పోయిందట.

ఆ నోటా.. ఈ నోటా విషయం ఊరంతా తెలియడంతో బావిని మరింత లోతుకు తవ్వారు.

అప్పుడు గణనాథుడి విగ్రహం బయల్పడింది. భక్తి పారవశ్యంతో ప్రజలు కొబ్బరికాయలను సమర్పించారు.

వీటిలో విశేషంగా పగిలిన కొబ్బరికాయల నీటి ద్వారా ఆ ముగ్గురు సోదరులు నిలుచున్న భూమి అంతా ప్రవహించింది.

అలా ఈ స్థలానికి కాణి పారడం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అదే కాణిపాకంగా మారింది.

కులోత్తుంగ చోళుడనే రాజు ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు.

ఇక అప్పటి నుంచి బావిలోని వినాయకుడు పెరుగుతున్నాడని భక్తులు అంటున్నారు.

దీనికి సాక్ష్యం వినాయకుడు ధరించిన వెండి కవచాలు సరిపోకపోవడమే. ఇప్పటికి మూడుసార్లు వెండి కవచాలు మార్చినట్లుగా ప్రజలు చెప్తున్నారు.

ఈ ఆలయం సత్యప్రమాణాలకు నెలవుగా భాసిల్లుతున్నది. వరసిద్ధి వినాయకుడే ఇక్కడ న్యాయ నిర్ణేత.

ఎలాంటి వివాదాలు వచ్చినా.. నేరారోపణలు జరిగినా నిర్దోషిత్వ నిరూపణకు ఈ క్షేత్రమే కేంద్రం అనేది ప్రజల ప్రగాఢ నమ్మకం.

బ్రిటిష్‌ కాలంలో కూడా ఇక్కడ సత్య ప్రమాణాలు చేసే ఆనవాయితీ కొనసాగింది.

ప్రతియేటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు వినాయకచవితి రోజే ప్రారంభమవుతాయి.

అంకురార్పణతో ప్రారంభించి 21 రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు.

బ్రహ్మాది దేవతలు వచ్చి ముద్దుల గణపతిని దర్శించుకొని వెళ్తారని భక్తుల నమ్మకం.

సర్వమత సమ్మేళన గణపతి

విఘ్న నాయకుడు వినాయకుడి వేడుకలు ఓ ప్రత్యేకత. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ వేడుకలు మరింత ప్రత్యేకం.

అక్కడ గణనాథుడిని అందరూ కొలవడం విశేషం. వినాయక చవితి వేడుకలను ముస్లిం సోదరులే అన్నీ తామై జరుపుతారు.

గత ఏడేండ్లుగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందిరా కాలనీకి చెందిన పోలిచెర్ల రహీంబాషా ఆధ్వర్యంలో ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారు.

సత్యహరిశ్చంద్ర నాటకం, కోలాటాలు, భజనలు.. ప్రతి సాయంత్రం ఉంటాయి.

మట్టిబొమ్మలను తయారు చేసి విద్యార్థుల తల్లిదండ్రులకూ ఏటా అందిస్తున్నారు.

అందరితో కలిసిమెలిసి పండగ చేసుకోవడం వల్ల మనమంతా ఒకటే అనే భావన పెరుగుతుందని.. అందుకే వినాయక ఉత్సవాలను మతాలకు అతీతంగా నిర్వహిస్తున్నామన్నారు.

చిన్నారులతో మట్టి విగ్రహాలను తయారు చేయించి, వారి తల్లిదండ్రులకు పంపిణీ చేస్తున్నట్టు కూడా తెలిపారు.

ఆవంచలో ఏకశిలా గణపతి

నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఏకశిల వినాయకుడు కొలువుదీరి భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తుతున్నాడు.

వినాయక ఉత్సవాల సందర్భంగా మండపాల్లో కొలువుదీరే గణపయ్యల సందడి చాలా ఎక్కువగా ఉంటుంది.

వైవిధ్యమైన రూపాల్లో గణనాథుడిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. మండపాలనూ ఆకర్షణీయంగా అలంకరిస్తారు.

స్వయంభుగా వెలిసిన ఆలయాల్లో కూడా భిన్న వినాయకులు కొలువుదీరి ఉంటారు.

అలాంటి అరుదైన ఓ గణపతి దేవుడు నాగర్‌ కర్నూల్‌ సమీపంలో కొలువయ్యాడు. ఈ గణపతి భారీ ఏకశిలా విగ్రహం కావడం విశేషం.

భక్తులు ఐశ్వర్య గణపతిగా కొలిచే ఈ గణనాథుడి ఎత్తు 30 అడుగులు.

దేశంలో ఇంత ఎత్తయిన ఏకశిలా విగ్రహం మరెక్కడా లేదు. గుల్బర్గా రాజధానిగా పాలించిన పశ్చిమ చాళుక్య రాజైన తైలపుడు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడట.

ఆవంచ గ్రామంలో ఉన్న ఏకశిలను అందమైన వినాయకుడి విగ్రహంగా తీర్చిదిద్దడానికి ప్రత్యేక శిల్పిని నియమించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు.

పని జరుగుతుండగానే తైలంపుడు అనారోగ్యానికి గురై అకస్మాత్తుగా చనిపోయాడు.

గణపయ్య శాపంతోనే ఇలా జరింగిందని స్థానికంగా ప్రచారంలో ఉన్నది.

ఇంతటి అరుదైన చారిత్రక సంపద.. ఏకశిలా గణపతి ఇంకా అభివృద్ధి చెందాలని భక్తులు కోరుతున్నారు. నిజమే, తెలంగాణ ప్రజల అదృష్టం.. ఆవంచ గణపతి!

Recent

- Advertisment -spot_img