pawan kalyan entering into vizag steel plant protest : ఆంద్రుల హక్కుగా భావించే విశాఖ ఉక్కు (Vizag Steel) 100 శాతం ప్రైవేటు పరమవ్వడం ఖాయం.
అయితే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ ఉద్యమానికి మొదట నుంచి టీడీపీ (TDP) , వామపక్షాలు (Communist parties), కాంగ్రెస్ (Congress) తీవ్రంగా పోరాటం చేస్తున్నాయి.
ఈ పార్టీలు చేసిన పోరాటానికి ఉక్కు కార్మిక సంఘాలు, నిర్వాసితులు సంపూర్ణంగా మద్దతు ఇచ్చాయి.
ఆఖరికి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో అధికార పార్టీ వైసీపీ (YCP) సైతం ఉద్యమంలో పాల్గొంది.
ఎంపీ విజయసాయిరెడ్డి (MP Vijayasai Reddy) పాదయాత్ర కూడా చేశారు. ఇప్పుడు ఈ పార్టీల సరసన జనసేన (Janasena) చేరనుంది.
వచ్చే నెలలో జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విశాఖపట్నం (Visakhapatnam) లో పర్యటించి.. ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు పలకనున్నారు.
దీంతో ఈ ఉద్యమానికి మరింత ఊపు వస్తుందని విశాఖ ఉక్కు కార్మికులు భావిస్తున్నారు.
గత ఎన్నికల్లో గాజువాక (Gajuwaka) అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయారు.
ఈ నియోజక వర్గం పరిధిలోనే స్టీల్ ప్లాంట్ ఉంది.
కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పినప్పటి నుంచి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ.. రిలే నిరాహార దీక్షలు చేస్తోంది. వివిధ స్థాయిలో పోరాటం చేస్తోంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉద్యమంలోకి వస్తే తమకు కొండంత అండ దొరుకుతుందని కార్మికులు, నిర్వాసితులు అంటున్నారు.
ప్రస్తుతం బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ ఉక్కు కార్మికులు, నిర్వాసితులు పోరాటానికి స్థానిక జనసేన నేతలు మద్దతు ఇచ్చారు.
ప్రవేటీకరణను వ్యతిరేకిస్తున్నామంటూ పలు అఖిలపక్ష సమావేశాలలో కూడా జనసేన నేతలు పాల్గొన్నారు.
అయితే బిజేపికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు మాత్రం.. చేయలేదు.
పవన్ కళ్యాణ్ ఇదే ఆంశంపై ఢీల్లీ వెళ్లి అమిత్ షా తో సహా పలువురు నేతలను కలిశారు.
కానీ కేంద్ర పెద్దలు ఏం చెప్పారనే విషయాన్ని ఇప్పటి వరకు పవన్ ఎక్కడా రివీల్ చేయలేదు.
పైగా కిందిస్థాయి నేతలే ఎప్పుడు తమ మద్దతు ప్రకటిస్తున్నారు తప్ప, పవన్ నేరుగా వచ్చిన సందర్బాలు లేవు.
విశాఖ ఉక్కు ఉద్యమకారులు అన్ని రాజకీయ పార్టీల మద్ధతు కోరుతున్నారు.
కానీ ఇప్పటి వరకు జనసేన నేరుగా ఉద్యమంలో పాల్గొనకపోయినా.. వచ్చే నెలలో నేరుగా అధినేత పవన్ వస్తుండడంతో ఉక్కు కార్మికులు.. ఇది తమ ఉద్యమానికి పూర్తి బూస్ట్ ఇచ్చినట్టు
అవుతుందని భావిస్తున్నారు. అయితే స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ అనుసరిస్తున్న వైఖరిపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.
జీవీఎంసీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నప్పుడు ఒకలా.. ఎన్నికలు మగిసిన తర్వాత ఇంకొలా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి.
ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ కేంద్రానికి సహాయసహకారాలు అందిస్తుందని.. కొంతమంది కార్మికనేతలు, నిర్వాసుతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ప్రజల్లో అనుమానం రాకుండా ఉండేందుకు వైసిపి నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ అవుతుందంటే అందుకు కారణం బీజేపీ అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్, విభజన హామీలు అమలు చేయకుండా.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడంపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
తరచు రాష్ట్ర బీజేపీ నేతలు.. ప్రవేటీకరణ చేయడం మంచిదేనని బహిరంగా చెప్పడాన్ని కార్మికులు, నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే బీజేపీతో పొత్తు కారణంగా జనసేన ఇప్పటి వరకు ఉక్కు పోరాటంలోకి పూర్తిస్థాయిలో రాలేదని విమర్శలు ఉన్నాయి.
జనసేన నేతలు మాత్రం, తమ పార్టీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతున్నారు.
అంతే కాదు ప్రవేటీకరణ చేయవద్దని.. అమిత్ షాతో సహా ఢిల్లీ పెద్దలకు పవన్ కళ్యాణ్ చెప్పారని.. ఇటీవల విశాఖ వచ్చిన ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు.
అంతేకాదు మిగిలిన నాయకుల్లా కేసుల భయపడో, రాజీలు కోసమో బీజేపీతో కలవలేదని అన్నారు.
వచ్చే నెలలో పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చి.. ఉక్కు కార్మికుల పోరాటానికి మద్దతు ఇస్తారని చెప్పారు.
కేంద్ర పెద్దలతో పవన్ కళ్యాణ్ మాట్లాడి వారిని ఒప్పిస్తారని నాదెండ్ల చెప్పడంతో.. ఉక్కు కార్మికులకు, నిర్వాసితులకు ఎక్కడా లేని బలం వచ్చింది.
గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షా శిబిరానికి వచ్చి కార్మికుల పోరాటానికి మద్దతు పలికారు.
సీఎం జగన్ కూడా స్టీల్ కార్మికులతో ఎయిర్ పోర్టులో సమావేశమయ్యారు. కానీ పవన్ నేరుగా వచ్చిన సందర్బాలు లేవు.
ఇప్పుడు పవన్ రాక వెనుక
అంతర్యం ఏమిటనేది తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. బీజేపీ, జనసేన మధ్య కటిఫ్ అంటూ ప్రచారం జరుగుతోంది.
రెండు పార్టీలు ఎన్నికలకు కలిసివెళ్లినా.. జనసేనే, బీజేపీకి బలం తప్ప.. బీజేపీ వల్ల రాష్ట్రంలో తమకు ప్రయోజనం లేదనే విషయాన్ని జనసేన గ్రహించిందట.
అందుకే గత కొద్దికాలంగా, రెండు పార్టీలు కలిసి ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించ లేదట.
ఒకవేళ బీజేపీ మొండిగా ప్రైవేటీకరణ అంశంపై వెళ్లితే.. దీనినే ఒక సాకుగా చూపించి, బీజేపీ పొత్తు నుంచి బయటకు రావాలనే ఆలోచనలో జనసేన ఉందంటూ ప్రచారం జరుగుతోంది.
ఏదీ ఏమైనా వచ్చే నెల ఈ రెండు పార్టీల పొత్తుపై క్లారిటీ రానుంది.