Homeఅంతర్జాతీయంBangladesh Hindhus : హిందువుల భద్రతపై భారత్‌కు షేక్ హసీనా హెచ్చరిక..

Bangladesh Hindhus : హిందువుల భద్రతపై భారత్‌కు షేక్ హసీనా హెచ్చరిక..

Sheikh hasina warning to india on Bangladesh Hindhus security : హిందువుల భద్రతపై భారత్‌కు షేక్ హసీనా హెచ్చరిక..

బంగ్లాదేశ్‌లో దుర్గా పూజ సందర్భంగా హిందూ దేవాలయాలపై దాడి జరిగింది.

ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, దోషులకు కఠినమైన శిక్ష విధించడంతో పాటు హిందువులకు భద్రత కల్పించాలని పునరుద్ఘాటించారు.

హిందువుల భద్రత గురించి షేక్ హసీనా ప్రభుత్వం కొన్నాళ్లుగా మాట్లాడుతూనే ఉంది.

కానీ వారి భద్రతను భారత్‌లోని నాయకులకు ముడిపెడుతూ బుధవారం ఆమె మాట్లాడిన తీరు మాత్రం మినహాయింపు.

బంగ్లాదేశ్‌లోని హిందువుల భద్రత గురించి భారత్ కూడా జాగ్రత్త వహించాలని హసీనా అన్నారు.

బంగ్లాదేశ్‌తో పాటు అక్కడ ఉన్న హిందువులపై ప్రభావం పడే విధంగా భారత్‌లో ఎలాంటి కార్యకలాపాలు జరగకూడదని ఆమె వ్యాఖ్యానించారు.

”భారత్‌లో ఏం జరుగుతుందనే దానిపై బంగ్లాదేశ్ అగ్ర నాయకత్వం బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేయడం ఇదే తొలిసారి” అని బంగ్లాదేశ్ మాజీ విదేశాంగ కార్యదర్శి తౌహిద్ హుస్సేన్ అన్నారు.

”మామూలుగానైతే భారత్‌కు మేమిలా నేరుగా, స్పష్టమైన సందేశాన్ని ఇవ్వం.

దేశంలోని అధికార పార్టీ బీజేపీకి చెందిన అత్యంత శక్తిమంతమైన నేత కూడా బంగ్లాదేశ్ గురించి అభ్యంతరకర భాషను ఉపయోగించారు.

అప్పుడు కూడా మేమిలా బహిరంగంగా మాట్లాడలేదు” అని అన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు అమిత్ షా, బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను ఉద్దేశించి కఠినమైన భాషను ఉపయోగించారు.

దీనిపై బంగ్లాదేశ్‌లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. అయినప్పటికీ ఆ దేశ ప్రభుత్వం దీని గురించి బహిరంగంగా ఏం మాట్లాడలేదు.

కానీ బుధవారం షేక్ హసీనా చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇందుకు మినహాయింపుగా కనబడుతున్నాయి.

అసలు భారత్‌కు షేక్ హసీనా ఏం చెప్పాలనుకుంటున్నారు?

”సందేశం చాలా స్పష్టంగా ఉంది. భారత్‌లో జరుగుతోన్న మతపరమైన సంఘటనలపై బంగ్లాదేశ్ స్పందించింది.

ఇలాంటి ఘటనలపై భారత్ దృష్టి సారించాలని హసీనా స్పష్టంగా చెప్పారు. ఆమె చెప్పింది కూడా నిజమే.

ఎందుకంటే, 1992 బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం ఏం జరిగిందో మేం కూడా చూశాం” అని తౌహిద్ అన్నారు.

ఆవామీ లీగ్ ప్రభుత్వం అసంతృప్తి

2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి, భారత్‌లో లౌకికవాదం భవిష్యత్‌పై నిరంతరం చర్చ నడుస్తూనే ఉంది.

దేశంలో ముస్లింలపై వివక్ష గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.

మతపరమైన కారణాల వల్ల ఒకే కమ్యూనిటీకి చెందిన ప్రజలపై దాడులు జరిగినట్లు, చనిపోయినట్లు తెలిపే అనేక ఉదాహరణలున్నాయి.

హిందుత్వ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తోందని ప్రభుత్వంపై కూడా ఆరోపణలు ఉన్నాయి.

పొరుగునే ఉన్న భారత్‌లో ముస్లిం వ్యతిరేక రాజకీయాలతో ఆవామీ లీగ్ ప్రభుత్వం అసౌకర్యంగా ఉందని బంగ్లాదేశ్‌లోని పరిశీలకులు అంగీకరిస్తున్నారు.

ఈ చర్యలు, ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్‌లో ప్రభావం చూపిస్తున్నాయని చెప్పారు.

ఆవామీ లీగ్ పార్టీ, తనను తాను సెక్యూలర్ పార్టీగా భావిస్తోంది. మతపరమైన తీవ్రవాదం, మత ఆధారిత రాజకీయ మూలాలను బలోపేతం చేయడం తమ విధి కాదని నమ్ముతోంది.

భారత్‌లో వివాదాస్పద పౌర సవరణ చట్టం అమల్లోకి వచ్చాక… గతేడాది కనీసం ఇద్దరు బంగ్లాదేశ్ మంత్రులు, భారత్‌లో తమ పర్యటనను రద్దు చేసుకున్నారు.

”భారత్‌లో మత రాజకీయాల వ్యాప్తితో ఆవామీ లీగ్ ప్రభుత్వం నిస్సందేహంగా అసౌకర్యంగా ఉంది.

అలా ఉండటం సహజమే. ఎందుకంటే పొరుగునే ఉన్న పెద్ద దేశంలో మత తీవ్రవాదం పెరిగినప్పుడు దాని ప్రభావం బంగ్లాదేశ్‌పై కూడా పడుతుంది.

భారత లౌకికవాద నిర్మాణం బలహీనపడింది” అని తౌహిద్ చెప్పుకొచ్చారు.

దౌత్యపరమైన బాధ్యతల కారణంగా తౌహిద్ తొమ్మిదేళ్లుగా భారత్‌లో ఉంటున్నారు.

”బంగ్లాదేశ్‌లో పరిస్థితి ఇతరులు ఆదర్శంగా తీసుకునేలా ఉందని నేను చెప్పట్లేదు. ఇక్కడ కూడా మత ఆధారిత రాజకీయాలు ఉన్నాయి.

మతోన్మాదులు ఉన్నారు. కానీ భారత్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని నేను నమ్ముతున్నాను.

చట్టాల పేరుతో దేశంలో బీజేపీ ప్రభుత్వం మతపరమైన విభజన రేఖను గీస్తోంది. ఇలా విభజించడంలో వారు సఫలమయ్యారు కూడా.

చాలా కాలం తర్వాత, భారతదేశంలో ఒక పార్టీ బహిరంగంగా మత రాజకీయాలను ప్రోత్సహిస్తోంది.

ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశ సమాజంలో మతతత్వం ప్రవేశించిందని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు” అని తౌహిద్ వివరించారు.

హసీనా వ్యాఖ్యలను భారత్ పట్టించుకుంటుందా?

షేక్ హసీనా వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దక్షిణాసియా రాజకీయాలను బోధించే ప్రొఫెసర్ సంజయ్ భరద్వాజ్ అన్నారు.

”భారతదేశ రాజకీయాలు, బంగ్లాదేశ్‌పై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయి.

అయినా దక్షిణాసియాలో మతం, జాతి, కులం, ప్రాంతం ఆధారంగా రాజకీయాలు చేయడం కొత్తేమీ కాదు” అని ఆయన చెప్పారు.

అయితే, భారతదేశ మత రాజకీయాలు, బంగ్లాదేశ్‌లోని మైనారిటీ వర్గాలపై ప్రభావం చూపిస్తాయని ఆయన అంగీకరించారు.

”ఇస్లాం ధర్మం ఆధారంగా బంగ్లాదేశ్ రాజ్యాంగం రూపొందింది. కానీ షేక్ హసీనా ప్రభుత్వం, అక్కడి మైనారిటీల హక్కుల గురించి కూడా పని చేసింది.

భారత్‌లోని మెజారిటీవాద రాజకీయాలు, ఇక్కడి అల్పసంఖ్యాకవర్గమైన ముస్లింలపైన ప్రభావం చూపాయి.”

”కానీ, భారత్‌లో ప్రజాస్వామ్యం ఇంకా బలంగానే ఉంది. భారత్ ఇంకా హిందు దేశంగా ఏం మారలేదు.

నరేంద్రమోదీ ఏడేళ్ల పాలన, ముస్లింలకు ప్రమాదకరంగా పరిణమించిందని నేను అనుకోవట్లేదు” అని ఆయన వివరించారు.

షేక్ హసీనా వ్యాఖ్యలను భారత్‌ సానుకూలంగా తీసుకోవాలని సంజయ్ భరద్వాజ్ అన్నారు.

బంగ్లాదేశ్‌లోని మైనారిటీల భద్రతను భారత్ కోరుకుంటే…. భారత్‌లోని మైనారిటీల భద్రతకు కూడా మోదీ సర్కారు హామీ ఇవ్వాలి.

బీజేపీ అగ్ర నాయకత్వం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తున్నా.

షేక్ హసీనా వ్యాఖ్యలకు బీజేపీ ప్రభుత్వం అంతగా ప్రాధాన్యం ఇవ్వబోదని బంగ్లాదేశ్ మాజీ విదేశాంగ కార్యదర్శి తౌహిద్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు.

”బీజేపీ అజెండా స్పష్టంగా ఉంది. అధికారం కోసమే వారు వర్గ రాజకీయాలు చేస్తున్నారు.

అధికారంలోకి రాకముందు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తానని బీజేపీ వాగ్దానం చేసింది. గుజరాత్ మోడల్ గురించి మాట్లాడింది.

కానీ, అధికారంలోకి వచ్చాక అలా ఏం జరగలేదు. ఆర్థిక వృద్ధి సాధించే వ్యూహాలు బీజేపీ వద్ద ఉన్నాయని నేను అనుకోవట్లేదు.

అలాంటప్పుడు వారు కేవలం మత ప్రాతిపదికగానే రాజకీయాలు చేస్తారు” అని పేర్కొన్నారు.

భారత్‌ను వేలెత్తి చూపడం ద్వారా షేక్ హసీనా తమ దేశ రాజకీయాల్లో వేడిని రాజేశారని తౌహిద్ అభిప్రాయపడ్డారు.

భారత్ విషయంలో, హసీనా నిశ్శబ్ద వైఖరి అలంభిస్తారనే పేరుంది.

Recent

- Advertisment -spot_img