CBI KEJRIWAL:ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరయ్యారు. ఇప్పటికే ఈ కేసులో ఆరెస్ట్ అయిన నిందుతులతో కేజ్రీవాల్ ను అధికారులు ప్రశ్నించనున్నారు. కేజ్రీవాల్ సీబీఐ విచారణ క్రమంలో ఆప్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో సీబీఐ కార్యాలయంతో పాటుగా ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. సీబీఐ విచారణకు హాజరయ్యేముందు కేజ్రీవాల్ రాజ్ ఘూట్ లోని గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఇక ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు.
బీజేపీ ఆదేశాలను సీబీఐ అనుసరిస్తుందని, ఒకవేళ తనను అరెస్టు చేయాలని ఆ పార్టీ చెప్పి ఉంటే అదేపని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో నేడు విచారణకు రావాలని కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు విచారణకు రావాలని సీబీఐ తనను పిలిచిందని, తప్పనిసరిగా హాజరువుతానని ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పారు. వారు చాలా పవర్ఫుల్. ఎవరినైనా జైలుకు పంపించగలరని అన్నారు. బీజేపీ ఆదేశాలనే సీబీఐ అనుసరిస్తుందన్నారు. ఒకవేళ తనను అరెస్టు చేయాలని బీజేపీ చెప్పి ఉంటే సీబీఐ అదే చేస్తుందని వెల్లడించారు. కమలం పార్టీ నేతలు తనపై అవినీతి ముద్ర వేస్తున్నారని చెప్పారు.