Homeతెలంగాణకామ్రేడ్ల దారెటు?

కామ్రేడ్ల దారెటు?

– పొత్తు ఉండదని క్లారిటీ ఇచ్చిన కేసీఆర్
– భవిష్యత్​ కార్యాచరణపై వామపక్షాల కీలక భేటీ
– వచ్చే ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ పొత్తు ?
– ఎంపిక చేసిన సెగ్మెంట్లలో పోటీ..

ఇదేనిజం, హైదరాబాద్​: బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందేమోనని కామ్రెడ్లు ఆశలు పెట్టుకున్నారు. కొన్ని నియోజకవర్గాలను బీఆర్ఎస్ తమకు వదిలేస్తుందని భావించారు. కానీ నిన్నటి బీఆర్ఎస్​ లిస్ట్​ను కేసీఆర్ ప్రకటించడంతో వారి ఆశలు అడియాసలయ్యాయి. మునుగోడు, దేవరకొండ, భద్రాచలం, వైరా, హుస్నాబాద్​ టికెట్లను కమ్యూనిస్టులు ఆశించారు. ఈ సెగ్మెంట్లను తమకు వదిలేస్తే బాగుంటుందని భావించారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కమ్యూనిస్టులకు పట్టు ఉన్న నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను ప్రకటించారు. అంతేకాక వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉండబోదని తేల్చిచెప్పారు. దీంతో కమ్యూనిస్టులు ఆశలు వదులుకున్నారు. ఒంటరిగా పోటీచేసి అధికారంలోకి రాగలమన్నా అంచనాకు వచ్చిన తర్వాతనే కేసీఆర్​ కమ్యూనిస్టులతో పొత్తు లేకుండా సింగిల్​ గానే బరిలో దిగాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

రెండు జిల్లాల్లో బలం..
కమ్యూనిస్టు పార్టీలకు రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కొంత పట్టు ఉంది. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్​ తో కటీఫ్​ కావడంతో ఇక సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయబోతున్నాయని సమాచారం. ఇవాళ ఓ కీలక సమావేశం జరగబోతున్నది. ఈ మీటింగ్​ లోనే రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అంశంపై నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. మరోవైపు కాంగ్రెస్​ పార్టీతోనూ పొత్తు విషయంపై కూడా సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఇండియా కూటమిలోనూ కమ్యూనిస్టు పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో సైతం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కమ్యూనిస్టులు యోచిస్తున్నట్టు సమాచారం. మరి కమ్యూనిస్టు పార్టీలకు కాంగ్రెస్​ పార్టీ ఎన్ని సీట్లు ఇస్తుందో.. వేచి చూడాలి. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని అనేక నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులకు కొంత ఓటు బ్యాంక్​ ఉంది. ఆ ఓట్లు కూడా వచ్చే ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ వల్లనే బీఆర్ఎస్ గెలిచిందని అప్పట్లో కమ్యూనిస్టు నేతలు బహిరంగంగానే ప్రకటించారు. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ తో పొత్తు కొనసాగిస్తామన్నారు. కానీ తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారిని పట్టించుకోలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి? అనే విషయంపై వారు ఆలోచనలో పడ్డారు

Recent

- Advertisment -spot_img