Health experts suggest that people with corona virus infection have three main symptoms and begin taking precautions as soon as they are detected.
కరోనా వైరస్ సోకినవారిలో ప్రధానంగా మూడు లక్షణాలు కనిపిస్తాయని, వాటిని గుర్తించగానే జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
{మా ఫేస్బుక్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి}
ఆ లక్షణాలేంటి?
- ఆగకుండా దగ్గురావడం, గంటల తరబడి దగ్గు కొనసాగడం, 24 గంటల్లో అలాంటి పరిస్థితులు రెండు మూడుసార్లు ఏర్పడటం
- జ్వరం విపరీతంగా ఉండటం, శరీర ఉష్ణోగ్రత 100 డిగ్రీల ఫారన్ హీట్ దాటడం
- వాసన గుర్తించలేకపోవడం.
ఇవీ ఈ వైరస్ సోకిన వారిలో కనిపించే ప్రధానమైన లక్షణాలు.
ఈ లక్షణాలున్న వారు మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఉన్నారంటే వెంటనే వారిని దూరంగా ఉండమని సలహా ఇవ్వాలి.
చలిగా ఉండటం, తరచూ వణికడం, ఒళ్లు నొప్పులు కూడా ఈ వైరస్ సోకినవారిలో కనిపించే లక్షణాలుగా గుర్తించారు నిపుణులు.
వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ లక్షణాలు కనిపించడానికి కనీసం ఐదురోజుల సమయం పడుతుంది. మరికొందరికి ఇంకా ఎక్కువ రోజులు కూడా పట్టొచ్చు.
ఈ వైరస్ 14 రోజుల వరకు శరీరంలో ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
కొద్దిపాటి లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి?
కరోనా లక్షణాలు కనిపించినంత మాత్రాన కంగారు పడి ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేదని ఇంట్లోనే ఉంటూ క్వారంటైన్ కావడం ప్రధానమైన చర్యగా చెబుతోంది ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)
ఐసీఎంఆర్ విడుదల చేసిన సూచనల ఆధారంగా వివిధ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖలు ఆసుపత్రులకు వస్తున్న పేషెంట్లకు సూచనలు చేస్తున్నాయి.
కరోనా లక్షణాలుగా కనిపించిన వెంటనే ఇంట్లో తగినంత స్థలం ఉన్నవారు హోమ్ క్వారంటైన్ కావాలని ఐసీఎంఆర్ సూచించింది.
కొద్దిపాటి జ్వరం, ఒళ్లు, నొప్పులులాంటి లక్షణాలున్నవారు నొప్పులను, జ్వరాన్ని తగ్గించే పారాసెటమాల్‌లాంటి మాత్రలు వాడి ఉపశమనం పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఆసుపత్రికి ఎప్పుడు వెళ్లాలి?
తట్టుకోలేని జ్వరం, దగ్గుతో ప్రధానంగా శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది పడేవారు మాత్రమే ఆసుపత్రికి రావాలని సూచించింది ఐసీఎంఆర్.
ఊపిరితిత్తులు ఏ స్థాయిలో దెబ్బతిన్నాయో పరిశీలించి ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సాయంతో డాక్టర్లు వైద్యం అందిస్తారు.
వైరస్ వల్ల ఏర్పడ్డ ఆరోగ్య సమస్యలు రోజువారి పనులు చేసుకోలేనంత ఇబ్బందిగా మారినప్పుడు కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు:
కేంద్ర ప్రభుత్వం – 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ – 104 కు కాల్ చేయాలి. లేదంటే సమీపంలోని ఆరోగ్యకార్యకర్తలకు పరిస్థితి వివరించి తక్షణం చికిత్స పొందాలి.
ఇంటెన్సివ్ కేర్‌లో ఏం జరుగుతుంది?
తీవ్రంగా జబ్బుపడిన వారికి చికిత్స అందించే ప్రత్యేక వార్డు ఇంటెన్సివ్ కేర్ యూనిట్.
ఈ వార్డుల్లో కరోనావైరస్ పేషెంట్లకు ఫేస్ మాస్కు ద్వారా కానీ, ముక్కు ద్వారా గొట్టం వేసి కానీ ఆక్సిజన్ అందిస్తారు.
ఇంకా తీవ్రంగా జబ్బుపడిన పేషెంట్లకు వెంటిలేటర్ ద్వారా నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లేలా గొంతులో గొట్టం వేసి ఆక్సిజన్ అందిస్తారు.
అవసరాన్ని బట్టి గొంతుకు రంధ్రం కూడా చేయాల్సి ఉంటుంది.
- ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఏంటి?
- వెంటిలేటర్లు అంటే ఏంటి?
వృద్ధులు, ఇప్పటికే పలు రకాల జబ్బుల (ఆస్తమా, డయాబెటిస్, హృద్రోగాలు, బీసీ) బారిన పడిన వారిపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు.
మహిళలకంటే ఎక్కువగా పురుషులు ఈ వైరస్ వల్ల చనిపోయే ప్రమాదం ఉంది.
మీలో ఆ లక్షణాలుంటే మీరేం చేయాలి?
కరోనావైరస్ మిగిలిన ప్రమాదకరమైన వైరస్‌ల మాదిరిగా గాలిలో ప్రయాణించలేదు. కానీ, వైరస్ బారినపడ్డ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ పెట్టుకుంటే మాత్రం వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లలో కరోనావైరస్ కణాలు ఉంటాయి.
చల్లని ప్రదేశాల్లో కొన్ని రోజులపాటు ఇది బతికుండే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.
ఆ వైరస్ ఉన్న వస్తువులపై చేతులు వేసిన వాళ్లకూ అది సోకే ప్రమాదం ఉంది.
అందుకే, మెట్రో స్టేషన్లలో ఎస్కలేటర్ల హ్యాండ్ రెయిల్స్, మెట్రో రైళ్లలో నిలబడేటప్పుడు పట్టుకునే హ్యాండిళ్లు, బస్సుల్లో సీట్ల వెనుక ఉండే హ్యాండిళ్లు వంటి వాటిపై చేతులు వేయకుండా ఉంటే మంచిది.
ఆ వస్తువులను పట్టుకుని, తర్వాత ఆ చేతితో ముఖాన్ని, నోటిని, ముక్కు, కళ్లను తాకితే వైరస్ నేరుగా శరీరంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ సోకినట్లు అనుమానం వస్తే వెంటనే హోమ్ క్వారంటైన్ కావాలని వైద్య ఆరోగ్య శాఖలు చెబుతున్నాయి.
మనకు వైరస్ సోకినట్లు తెలియగానే, అది ఇతరలకు సోకకుండా జాగ్రత్త పడాలి.
సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోవడం, ఇతరకు కనీసం ఒకటి నుంచి మూడు మీటర్ల దూరం పాటించడం, ముఖానికి మాస్క్ తగిలించుకోవడం ముఖ్యమైన చర్యలు.
దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు నోటి నుంచి తుంపరాలు గాల్లోకి లేదా ఇతరుల మీదికి వెళ్లకుండా మాస్క్, కర్ఛీఫ్, టిష్యూపేపర్లను అడ్డంగా పెట్టుకోవాలి.
గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మాస్కుల వల్ల ఉపయోగంలేదన్నా, తర్వాత అవి వాడటం వల్ల వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని, అందరూ వాడేలా చూడాలని వివిధ దేశాలకు సూచించింది.
వైరస్ సోకిన లక్షణాలు కనిపించగానే ఆసుపత్రులు, మెడికల్ షాపులకు పరుగెత్తకూడదు.
అందరికీ దూరంగా ఉంటూ ప్రభుత్వ హెల్ప్ లైన్‌కు, ఆరోగ్య కార్యకర్తలకు ఫోన్ చేసి సూచనలు, సలహాలు తీసుకోవాలి.
మనం వివిధ వస్తువులను, ప్రదేశాలను తాకినప్పుడు అక్కడున్న వైరస్ మనల్ని అంటుకుంటే చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా వాటిని మన శరీరంలోకి వెళ్లకుండా కాపాడుకోవచ్చు.
20 సెకండ్ల నుంచి ఒక నిమిషంపాటు సబ్బుతో గట్టిగా రుద్దుతూ చేతులు కడుక్కోవాలని, చేతులు పైకెత్తి గాలిలో ఆరబెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
మనలో వైరస్ ఉన్నప్పుడు మన నుంచి మరొకరికి వైరస్ ప్రసారం కాకుండా నోటికి చేతిని, రుమాలను లేదా మాస్కును అడ్డుపెట్టుకోవాలి.
తుమ్ము, దగ్గు వల్ల ఏర్పడే తుంపరల్లో వైరస్ ఉంటుందని, ఆ తుంపరలు మరొకరి ముక్కు, నోరు, కళ్లలోకి వెళ్లినప్పుడు వారికి వైరస్ వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చేతులు ముఖానికి తాకుండా జాగ్రత్త పడటం కూడా వైరస్‌ను నిరోధించడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది.
ఒకవేళ చేతికి వైరస్ అంటుకున్నా అది శరీరంలోకి వెళ్లకుండా ఉండాలంటే ముఖానికి, ముఖ్యంగా నోరు, కళ్లు, ముక్కులకు చేతులు తగలకుండా జాగ్రత్తపడాలి.
ముఖానికి మాస్కు ధరించాలి.