– కేసీఆర్ను ప్రశ్నించిన కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాపీ కొట్టారని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఖమ్మంలోని ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు ఎలా ఇస్తారని బీఆర్ఎస్ నేతలు అడిగారు.
ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టో ఎలా అమలు చేస్తారు? లక్ష కోట్ల మీ అక్రమ సంపాదనలో తీసి ఖర్చుపెడతారా? తెలంగాణను బీఆర్ఎస్ సర్కారు తాగుబోతుల రాష్ట్రంగా మార్చి దోచుకుంటున్నది. ఇందిరమ్మ రాజ్యం రాగానే దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం. త్వరలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తాం.’ అని పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. మరో నేత తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. తన కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.