– మంత్రి కేటీఆర్ హామీ
– ఆత్మహత్యకు కారణమైన నిందితుడిని పట్టుకుని శిక్ష పడేలా చేస్తమని వెల్లడి
ఇదే నిజం, హైదరాబాద్: మర్రి ప్రవళిక కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో ఆత్మహత్య చేసుకున్న యువతి మర్రి ప్రవళిక కుటుంబసభ్యులు బుధవారం ప్రగతి భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ప్రవళిక కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ ధైర్యం చెప్పారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రవళిక కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేం అని పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకుని చట్టపరంగా శిక్షపడేలా చూస్తామన్నారు. ప్రవళిక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటాం.. ఒకరికి ఉద్యోగం ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
కేటీఆర్‌ను కలిసిన అనంతరం ప్రవళిక సోదరుడు ప్రణయ్ మాట్లాడుతూ.. కేసు పురోగతిపై డీజీపీతో మాట్లాడినట్లు కేటీఆర్ చెప్పారని తెలిపారు. తమ కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో కేటీఆర్‌ను ప్రవళిక తల్లితండ్రులు, తమ్ముడు ప్రణయ్ కలిశారు. అయితే బుధవారం ఉదయం కరీంనగర్లో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ వ్యవహారంపై స్పందించారు.‘ప్రవళిక మృతిని కూడా రాజకీయం చేశారు. ప్రవళిక కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చారు.. న్యాయం చేయాలని కోరారు. ప్రవళిక కుటుంబాన్ని ఆదుకుంటాం. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తాం. అంతే కాకుండా ఆ అమ్మాయిని వేధించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు జరగకుండా ముందుగా జాగ్రత్తపడతాం.’ అని కేటీఆర్ తెలిపారు.