– రాష్ట్రంలో జరిగిన ఎన్నో కుంభకోణాల్లో కేసీఆర్ పాత్ర ఉంది
– కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర విమర్శలు
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: రాష్ట్రంలో రిగిన అనేక కుంభకోణాల్లో కేసీఆర్ హస్తం ఉందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతికి కవల పిల్లలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన నారీ శక్తి వందన్ మహిళ సమ్మేళనం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు కావాలని అందరం కలిసి కొట్లాడినం.. కానీ ఏవీ నెరవేరలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.40 వేల కోట్లతో ప్రారంభించి లక్ష కోట్లకు పెంచారు. మిగులు బడ్జెట్తో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం అప్పులు చేసి తన కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటున్నారు తప్ప ఈ కేసీఆర్ ప్రజలకు చేసింది ఏమీ లేదు.
తన స్వార్థం కోసం తెలంగాణ యువతను వంచించింది కేసీఆర్ ప్రభుత్వం. మనల్ని మోసం చేసిన కేసీఆర్ను ఎదిరించే రఘునందన్ వైపు ప్రజలు నిలబడాలి. అల్లుడు, మామ, కొడుకు, బిడ్డతో కొట్లాడి గెలిచిన నాయకుడు రఘునందన్ రావు.’అని స్మృతి ఇరానీ తెలిపారు. కరోనా సమయంలో ఇంటింటికీ తిరిగి వాక్సినేషన్ అందించిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానిదని ఆమె చెప్పారు. ‘కాంగ్రెస్ అధికారంలో ఉంటే కరోనా వాక్సినేషన్ ఇచ్చేదా అని ఒకసారి ఆలోచన చేయండి. కుటుంబ సభ్యులు బాగుండాలనే లక్ష్యంతో దేశ ప్రజలకు కరోనా వ్యాక్సినేషన్, రేషన్ బియ్యం ఉచితంగా మోడీ పంపిణీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు? దళిత బంధు పథకంలో 30% కమీషన్ తీసుకుంటున్నారని స్వయంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే లను హెచ్చరించారంటే వారి అవినీతి ఎంతో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో జయ జయ హే తెలంగాణ గీతం ఎందుకు రాష్ట్ర గీతం ప్రకటించలేదో కేసీఆర్ చెప్పాలి.’’ అని స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్కు ఓటేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే..
మోసం చేసే కేసీఆర్ వైపు ఉంటారా?.. అభివృద్ధి చేసే మోడీ వైపు ఉందామా జనం ఆలోచన చేసుకోవాలని స్మృతి ఇరానీ అన్నారు. అవినీతి అనే పదానికి పర్యాయ పదం కాంగ్రెస్, బీఆర్ఎస్ అని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్కు ఓటేస్తే అది బీఆర్ఎస్కే చేరుతుందన్నారు. ఇది 2018లో చరిత్ర చెప్పిన సాక్ష్యమని ఆమె తెలిపారు.‘సిద్ధిపేటకు రైలు తెచ్చి ప్రజల కలను నెరవేర్చిన నాయకుడు ప్రధాని మోడీ. రామగుండం ఫర్టీలైజర్ కంపెనీ ఓపెన్ చేసి ఎరువుల కొరతను తీర్చాం. 2014 వరకు జాతీయ రహదారులు 2500 కి. మీ అయితే మోడీ వచ్చాక మరో 2500 కి. మీ నిర్మించారు. కమలం గుర్తుకు ఓటేసి కేసీఆర్కు బుద్ధి చెప్పాలి.’అని స్మృతిఇరానీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.