– భోపాల్ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ గెలుపు కోసమేనని ప్రచారం
– సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తాంత్రికపూజల ఫొటోలు
ఇదేనిజం, నేషనల్ బ్యూరో : ఎన్నికల్లో గెలిచేందుకు నేతలు పడేపాట్లు అంతాఇంతా కాదు. కానీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు భోపాల్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు అందర్ని భయాందోళనకు గురిచేస్తుంది. కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ తన గెలుపు కోసం తాంత్రికపూజలు చేయిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. కమల్‌నాథ్ ఫోటో పెట్టి, దాని ఎదురుగా పూలు, నిమ్మకాయలు, కుంకుమ లాంటి సామాగ్రితో క్షుద్ర పూజలు చేస్తున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కమల్‌నాథ్ సీఎం కావాలనే తను ఈ పూజలు చేస్తున్నట్లుగా తాంత్రిక పూజారి భయ్యూ మహారాజ్ ఓ టీవీ ప్రతినిధికి కూడా చెప్పారు. దీంతో ఈ ఘటన మరింత గందరగోళానికి దారి తీసింది.
దీనిపై సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ కూడా స్పందించారు. ‘ఎవరైనా ఆధ్యాత్మిక సాధనలో భక్తి మార్గంలో నిమగ్నం కావాలంటే దానికి ధర్మబద్ధంగా స్వచ్ఛంగా నిర్వహించుకోవాలి. అలాకాకుండా ఇలా క్షుద్ర పూజలు చేయడమేంటి? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది’ అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు సేవ చేయాలి. దీనికోసం మేము చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూనే ప్రజలకు దగ్గరవుతాం. కొందరు మాత్రం శ్మశాన వాటికలో తాంత్రిక పూజలు చేస్తున్నారు. వీటితో దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా?’ అని ప్రశ్నించారు. ఈ ఘటన ఇప్పుడు భోపాల్ రాజకీయాల్లో కీలకంగా మారింది.