ఇదే నిజం, నేషనల్ బ్యూరో: పశ్చిమ్ బెంగాల్ అటవీ శాఖ మంత్రి, టీఎంసీ నేత జ్యోతిప్రియో మల్లిక్‌ను శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అదుపులోకి తీసుకుంది. రేషన్ స్కామ్‌లో 20 గంటలు ప్రశ్నించిన తర్వాత తెల్లవారుజామున ఆయన్ను అరెస్టు చేసింది.
జ్యోతిప్రియో బెంగాల్ ప్రభుత్వంలో ఆహార మంత్రిగా ఉన్న సమయంలో రేషన్ పంపిణీ కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మల్లిక్‌కు చెందిన కోల్‌కతాలోని రెండు ఫ్లాట్లలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి మాజీ వ్యక్తిగత సహాయకుడి నివాసంతో పాటు మొత్తం 8 ఫ్లాట్లలో తనిఖీలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది. అలాగే వారిని ప్రశ్నించింది.
20 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం మంత్రిని తన ఇంట్లో అరెస్టు చేసి, ఈడీ ఆఫీసుకు తరలించారు. ఆ సమయంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లను మోహరించారు. ‘నేను కుట్రలో బాధితుడిని’అని తనను అదుపులోకి తీసుకున్న సమయంలో మంత్రి వ్యాఖ్యానించారు. ఈ దాడులను ఉద్దేశించి గురువారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఆరోగ్యం క్షీణిస్తే.. బీజేపీ, దర్యాప్తు సంస్థపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ‘వారు మానసికంగా మాత్రమే హింసిస్తారని, శారీరకంగా హింసించరని మీరు అనుకుంటున్నారా..? వారు మనల్ని లోపలికి అనుమతించరు. ఈడీ దాడుల వల్ల మంత్రికి ఏమైనా జరిగితే.. బీజేపీ, ఈడీపై మేం కేసులు పెడతాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు.