– తెల్లవారుజామున ఉండవల్లిలోని ఇంటికి చేరుకున్నటీడీపీ అధినేత
ఇదే నిజం, ఏపీ బ్యూరో: స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ రావడంతో రాజమండ్రి జైలు నుంచి రిలీజైన టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఉదయం 5 గంటలకు ఉండవల్లి చేరుకున్నారు. ఇంటికి చేరుకోగానే చంద్రబాబుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి హారతిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆమె దిష్టి తీశారు. మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని గుమ్మడికాయలు కొట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మంగళవారం సాయంత్రం 4 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన రిలీజ్ అయ్యారు. 4.40 గంటలకు రోడ్డుమార్గాన విజయవాడ వైపు బయలుదేరారు. అడుగడుగునా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు దారి పొడవునా హారతులు పట్టి తమ అభిమాన నేతను చూసి భావోద్వేగానికి గురయ్యారు. సుమారు 13 గంటలపాటు చంద్రబాబు ప్రయాణం చేశారు. కరకట్ట నుంచి ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వరకు రైతులు పూలబాట పరిచారు.
అయితే, ఇంటికి చేరుకున్న సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు భావోద్వేగానికి గురయ్యారు. పలువురు కుటుంబసభ్యులు చంద్రబాబును ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కూడా ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. వారికి ఆయన ధైర్యం చెప్పారు. అంతా మంచే జరుగుతుందని.. ధైర్యంగా ఉండాలని సూచించారు.