– మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, క్రికెట్ అభిమానులు రాత్రంతా టీవీలకు అతుక్కుపోయి మరీ మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సైతం రాత్రంతా మేల్కొని మరీ ఈ మ్యాచ్‌ను ఎంతో ఇంట్రెస్ట్‌గా చూశారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. సియాటెల్‌లో మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో కీలక ఉపన్యాసం చేసి వచ్చిన తర్వాత రాత్రంతా మేల్కొని మరీ భారత్ – న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించినట్లు చెప్పారు. ‘ఇగ్నైట్ పేరిట సియాటెల్‌లో మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్‌ను షెడ్యూల్ చేసిన రోజే వన్డే ప్రపంచకప్ 2023 సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని మాకు తెలియదు. కాన్ఫరెన్స్‌లో కీలక ఉపన్యాసం చేసి వచ్చిన తర్వాత మ్యాచ్‌లో మునిగిపోయా. రాత్రంతా మేల్కొనే ఉన్నా. భారత్ విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా, వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో టీమ్ఇండియా 70 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఓవరాల్‌గా మెగాటోర్నీలో నాలుగోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించిన భారత్ ముచ్చటగా మూడోసారి కప్‌ను ముద్దాడేందుకు మరో అడుగుదూరంలో ఉంది.