– నీట మునిగిన వందల ఎకరాల పంట
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: నాగర్జునసాగర్ ఎడమ కాల్వపై నిర్మించిన బేతవోలు వరద కాల్వకు ఉన్న ఎస్కేప్ షట్టర్ ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఊడిపోయింది. సూర్యాపేట జిల్లా మునగాల మండల హెడ్‌క్వార్టర్ శివారులో ఈ ఘటన జరిగింది. దీంతో దిగువ ప్రాంతాలకు సాగర్ ఎడమ కాల్వ నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో చిలుకూరు మండలంలోని వివిధ ప్రాంతాల్లో వందల ఎకరాలు నీట మునిగాయి. కోత కోసి పొలాల్లోనే ఉంచడంతో పంటలు తడిసి ముద్దయ్యాయి. సోమవారం తెల్లవారుజామున నాగార్జున సాగర్ సీఈ రమేష్‌బాబు, ఎస్ఈ నరసింహరాజు కాల్వను పరిశీలించి నీటిని నిలిపివేశారు. అయితే ఈలోపేలే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. పంటలు నీటమునగడంతో రైతులు ఆందోళన చేపట్టారు. బేతవోలు చెరువు నింపేందుకు జేసీబీతో షట్టర్ తెరిచినట్లు పోలేనిగూడెం రైతులు ఆరోపిస్తున్నారు.