– కాంగ్రెస్ ఫిర్యాదుతోనే నిర్ణయం
– ఎన్నికల ముందు ఈసీ కీలక నిర్ణయం
– కోడ్ ఉల్లంఘించడంతోనే..
– 70 లక్షల మందికి సాయం నిలిపివేత
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది. రైతు బంధు సాయం నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల ఈసీ అనుమతి ఇచ్చింది. కాగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని.. రైతుబంధు నిలిపివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఫిర్యాదు ఆధారంగానే ఈసీ రైతు బంధును ఆపేసినట్టు తెలుస్తోంది.
‘ప్రచార సభల్లో రైతుబంధు గురించి ప్రస్తావించరాదని… లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయొద్దని ముందే ఈసీ షరతు విధించింది. కాగా ప్రచారసభల్లో ఇటీవల హరీశ్ రావు రైతుబంధుపై వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఈసీకి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో తాజాగా ఈసీ అనుమతి నిరాకరించింది. రైతు బంధు కింద ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఒక్కో సీజన్‌కు ఎకరానికి రూ.5 వేల చొప్పున రెండు సీజన్లకు మొత్తం రూ.10 వేలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ డబ్బు రైతుల అకౌంట్లలో పడాల్సి ఉండగా.. ఈసీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈసీ అనుమతి నిరాకరణతో రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు ‘రైతుబంధు’ సాయం నిలిచిపోనున్నది.
మేం పవర్ లోకి రాగానే రూ. 15 వేలు ఇస్తాం
‘రైతుబంధు’ పంపిణీ నిలిచిపోవడంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. తాము పవర్ లోకి రాగానే రూ. 15 వేలు ఇస్తామంటూ పీసీసీ చీప్ రేవంత్ పేర్కొన్నారు. దీంతో రేవంత్ ప్రకటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతు భరోసా విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఓ విధానమంటూ లేదు. రూ. 15 వేలు పట్టా రైతుకు ఇస్తారా? లేక కౌలు రైతుకు ఇస్తారా? అన్న విషయంపై ఆ పార్టీకి క్లారిటీ లేదు. మరోవైపు ధరణి యాప్ ను తీసేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రకటించింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 15 వేలు ఇవ్వడం సాధ్యమేనా? అన్న చర్చ సాగుతోంది.