– ఢిల్లీ నుంచి పరిశీలకులు
– మొదలైన హడావుడి
– లోకల్ లీడర్స్ లాబీయింగ్ స్టార్ట్
– బెంగళూరు కేంద్రంగా పొలిటికల్ గేమ్ స్టార్ట్
– అంతా అబ్జర్వర్ల చేతిలోనే..
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం మొదలైంది. ఈ తరహా రాజకీయం కొంతమంది రాజకీయ పరిశీలకులకు.. పాత తరం ఓటర్లకు సుపరిచితమే. కొత్తగా రాజకీయాలు గమనిస్తున్నవాళ్లకు కాంగ్రెస్ మార్కు రాజకీయం పెద్దగా పరిచయం ఉండదు. అయితే గత పదేండ్లుగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం కనిపించలేదు. కానీ తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఊపు కనిపిస్తోంది. ఈ సారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లోనూ ఆ పార్టీదే పైచేయిగా కనిపిస్తోంది. దీంతో మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం మొదలైంది. ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ గడ్డ మీదకు అడుగుపెట్టారు. సహజంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కనక రాజకీయం మొత్తం ఢిల్లీ కేంద్రంగానే సాగుతూ ఉంటుంది. తాజాగా ఈ వ్యవహారం మరింత పీక్ స్థాయికి చేరుకున్నది. ఈ సారి కాస్త భిన్నంగా ఓ వైపు కర్ణాటక లీడర్లు.. మరోవైపు ఢిల్లీ పెద్దల రాకతో హైదరాబాద్ రాజకీయం వేడెక్కింది. ఢిల్లీ పెద్దలు రాష్ట్రానికి రావడం.. ప్రతి కీలక నిర్ణయం సీల్డ్ కవర్ లోనే వెలువడటం.. కాంగ్రెస్ పార్టీలో పరిపాటిగా ఉంటుంది. ఇక దూతలు ఇక్కడి సమాచారం అక్కడికి.. అక్కడి సమాచారం ఇక్కడికీ మోస్తూ బిజీగా ఉంటారు. కొంతమంది కీలక నేతల ఇండ్లల్లో జోరుగా పైరవీలు సాగుతుంటాయి. రాష్ట్రంలో ఏ కీలక పదవి విషయంలోనైనా.. నిర్ణయాలు ఢిల్లీ స్థాయిలోనే ఉంటాయి. అందుకే కీలక నేతలు బస చేసిన హోటళ్లకు రాష్ట్ర నేతలు క్యూ కడుతూ ఉంటారు. లాబీయిస్టులు కూడా యాక్టివ్ అవుతారు. మళ్లీ అదే తరహా రాజకీయం రాష్ట్రంలో రాబోతున్నదని చర్చ సాగుతోంది.
ఫలితాలు రాక ముందే అలర్ట్
ఇక కాంగ్రెస్ పార్టీ ఈ దఫా గతానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. ఫలితాలు రాకముందే ఫుల్ అలర్ట్ అయిపోయింది. తమ ఎమ్మెల్యేలు చేజారిపోతారేమోనని కాంగ్రెస్ జాగ్రత్త పడింది. బెంగళూరులో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. తమ పార్టీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ట్రాప్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల వెనుక బహుముఖ వ్యూహం దాగిఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద పరోక్ష నిఘా పెట్టామని హెచ్చరించడంతో పాటూ.. ఎవరూ కాంగ్రెస్ పార్టీని వీడొద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు ఆయన కామెంట్లు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
డీకే కీరోల్
తెలంగాణ బాధ్యతలు మొత్తం కాంగ్రెస్ పార్టీ డీకేకు అప్పగించింది. దీంతో తెలంగాణ బాధ్యత మొత్తం ఆయన నెత్తికెత్తుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఆయనే దిశా నిర్దేశం చేస్తున్నారు. గతంలో డీకే శివకుమార్ ఎన్నోసార్లు కాంగ్రెస్ పార్టీని కష్టాలనుంచి గట్టెక్కించారు. క్యాంపు రాజకీయాలు చేయడం.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకోవడం.. డీకేకు వెన్నతో పెట్టిన విద్య. దీంతో ఆయనకు తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం బెంగళూరులోని అనేక రిసార్ట్ లు, హోటళ్లు డీకే గుప్పిట్లోనే ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తాజ్ కృష్ణ హోటల్‌కు తరలించారు. దాదాపు 50 గదులను ఇప్పటికే బుక్ చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత వీరిని బెంగళూరుకు తరలించే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. మొత్తంగా రాష్ట్రంలో కాంగ్రెస్ మార్కు రాజకీయం మొదలైందన్న చర్చ మొదలైంది. ఇంకా ఫలితాలు విడుదల కాకముందే కాంగ్రెస్ పార్టీ మాత్రం తన మార్కు రాజకీయం మొదలుపెట్టింది.