Homeజిల్లా వార్తలునమ్మిన వారే…ముంచారా?

నమ్మిన వారే…ముంచారా?

అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రెడ్యానాయక్‌ ఘోర పరాజయం పాలుకావడంపై ఆ పార్టీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి రామచంద్రనాయక్‌ గెలుపు సాదాసీదాగా ఉంటుందని అందరు భావించినప్పటికీ.. ఇంత మెజార్టీ వస్తుందని ఊహించలేదు. డాక్టర్‌ రామచంద్రనాయక్‌కు 1,15,587 ఓట్లు రాగా, రెడ్యానాయక్‌కు 62,456, ఓట్లు వచ్చాయి. సుమారు 53,131 మెజార్టీతో రామచంద్రనాయక్‌ గెలుపొందడంపై బీఅర్‌ఎస్‌ శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. డోర్నకల్‌ నియోజకవర్గంలో 256 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా గ్రామాలు మినహా, మిగతా అన్ని పోలింగ్‌ కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ లీడ్‌ కొనసాగింది. ప్రజలు కసి కొద్దిగా కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేసినట్లు తెలుస్తుంది. ఇది నిజమైనప్పటికీ నాయకులు ఒప్పుకోలేకపోతున్నాట్లు సమాచారం. బలమైన క్యాడర్‌, పుష్కలంగా ప్రతినిధులు ఉన్నప్పటికీ సరైన ఓటు పోలింగ్‌ సమకూర్చుకోలేక పోయినట్లు ఆ పార్టీ వర్గాలలో చర్చ సాగుతోంది.

అంతేగాక సత్యవతి రాథోడ్‌ అనుచరులతో రెడ్యానాయక్‌ తన వెంట వేసుకొని తిరిగిన వారు మనస్ఫూర్తిగా సహకరించారా లేదా అనేది కార్యకర్తల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉకల్‌ గ్రామంలో కాంగ్రెస్‌ మెజార్టీ వచ్చింది, పెద్దముప్పారం, పెద్ద నాగారం, రాజాపురం, పెద్దతండా, అయ్యగారిపల్లి, ఎల్లంపేట, జయ్యారం, ఉమ్మడి వీరారం, మరిపెడ, డోర్నకల్‌,మునిసిపాలిటీ, ఉమ్మడి గొల్లచర్ల, బలపల, చిలుకోడు, పెరుమాండ్ల సంకీస,గ్రామాలలో బలమైన నాయకులు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీకి లీడ్‌ రావడంతో బీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురు దెబ్బతగిలింది. అంతేగాక నియోజవర్గంలో దళితబంధు విషయంలో చేపట్టిన ప్రక్రియ దళితుల కుటుంబాల మధ్య చిచ్చు పెట్టినట్లు తెలిసింది. అది కూడా ఎన్నికల ముందు పంపిణీ జరిగినట్లయితే కొంతమేరకు లబ్ధిదారులు బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూసే అవకాశం ఉండేదని పలువురు భావించినట్లు ఆ పార్టీ వర్గాలలో చర్చ సాగుతోంది. ఏదేమైనప్పటికీ తను వెంట ఉన్నవారే మోసం చేశారని బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాంటి వారు ఎవరైనా ఉంటే ప్రక్షాళన చేసుకుంటే బాగుంటుందని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img