ఇదే నిజం, ఇనుగుర్తి: గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవోను పున:పరిశీలించాలని టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు గండు సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో గురువారం ఫెడరేషన్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. దీనికి ఆయన హాజరై మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోతో ఉద్యోగులు ఉపాధ్యాయులు సొంత జిల్లాలను వదిలి వేరే జిల్లాల లో ని మారుమూల ప్రాంతాలలో ఉద్యోగం చేయాల్సిన దుస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ జీవోను సమీక్షించి సీనియార్టీ ప్రకారం కాకుండా సర్వీస్ బుక్ ఆధారంగా జిల్లాలను కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి కదిరే ప్రభాకర్, ఉపాధ్యక్షుడు కొమ్మురాజేందర్, సారంగపాణి, కోటేశ్వర్, సభ్యులు శ్రీశైలం, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.