Homeహైదరాబాద్latest NewsNGKL: అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి: అచ్చంపేట MLA

NGKL: అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి: అచ్చంపేట MLA


ఇదేనిజం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండల కేంద్రంలో ఎంపీపీ అరుణ ఆధ్వర్యంలో మండల స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ నివేదికలు చదివి వినిపించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల గురించి వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు సభ దృష్టికి తీసుకోచ్చారు. అనంతరం సభనుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ..అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే అభివృద్ధి పనులు పురోగతి సాధించడం జరుగుతుందని, అధికారులు అభివృద్ధి పనుల్లో అలసత్వం ,నిర్లక్ష్య వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలే పాలకులని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి వారి అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందన్నారు.


అహంకారంతో పాలన సాగించిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడారని గుర్తు చేశారు. అన్ని బలాలకంటే ప్రజా బలం గొప్పదని కాంగ్రెస్ పార్టీ ప్రజాబలంతో రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తుందని అన్నారు. అచ్చంపేట నియోజకవర్గంలో విద్య, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పాఠశాలల్లో, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బల్మూర్ మండలంలో జాతీయ ఉపాధి హామీ పనుల్లో సామాజిక తనిఖీలో వెలుగు చూసిన అవినీతి అక్రమాల తుది నివేదిక అందించాలని ఎంపీడీవోను ఆదేశించారు.గ్రామాల్లో సీసీ రోడ్ల పనులు చేయకుండానే రికార్డులను సృష్టించి బిల్లులు స్వాహా చేసిన వారిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రామాల్లో విద్యుత్ సప్లైలో అంతరాయం జరిగితే ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులకు స్పందించాలని, గతంలో మాదిరిగా ఫోన్ స్విచ్ ఆఫ్ లు చేసుకొని నిర్లక్ష్యం వహించడం తగదన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారుతున్నా, రాబడి మీద ఉన్న ధ్యాస ప్రజల ఆరోగ్యం,అభివృద్ధిపై ఉండేది కాదని విమర్శించారు. అధికారులు ప్రజాప్రతినిధులు అంకితభావంతో సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. సర్పంచులకు ఇది చివరి సర్వసభ్య సమావేశం కావడం చేత వారిని సన్మానించారు. అధికార దర్పానికి తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేసేవారిని ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ సాధిబ్, ఎంపిడివో దేవన్న, ఎంపీపీ అరుణ, వైస్ ఎంపీపీ నారాయణ, జెడ్పీటీసీ లక్ష్మీ దేవమ్మ, అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img