భారత మాజీ క్రికెట్ ఆటగాడు, 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరతున్నారా? పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం గురుదాస్‌పూర్ నుంచి బీజేపీకి చెందిన బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన యువరాజ్ రాజకీయాల్లోకి వస్తారని, బీజేపీలో చేరుతాడన్న పుకార్లు షికార్లు చేశాయి. శుక్రవారం నాడు న్యూఢిల్లీలో యువరాజ్, అతని తల్లి షబ్నమ్ సింగ్ కలుసుకున్నారు. వారి సమావేశానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ద్వారా పంచుకున్నారు కేంద్ర మంత్రి గడ్కరీ. 2019లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు ముందు అన్ని రకాల క్రికెట్‌ల నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్న యువరాజ్, రాజకీయాల్లో చేరాలనే కోరికను ఎప్పుడూ వ్యక్తం చేయలేదు. అయితే, యువరాజ్ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో గురుదాస్‌పూర్ లోక్‌సభ స్థానం నుండి బరిలోకి దిగుతారని ప్రచారం జోరందుకుంది. సన్నీ డియోల్ తర్వాత నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని మారవచ్చని భావిస్తున్నారు. ఇదిలావుంటే, యువరాజ్ తన మాజీ భారత క్రికెట్ టీమ్ సహచరులు గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ ఇప్పటికే రాజకీయాల్లోకి కొనసాగుతున్నారు. గౌతమ్ గంబీర్ ప్రస్తుతం తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీ కాగా, హర్భజన్ పంజాబ్ నుంచి ఆప్ ఎంపీగా ఉన్నారు. ఇక మిగిలిన క్రికెటర్ల విషయానికి వస్తే, మాజీ టీమిండియా కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్, కీర్తి ఆజాద్ వంటి పలువురు గతంలో ఎన్నికల్లో పోటీ చేసి విజయవంతమైన రాజకీయ జీవితాన్ని ఆస్వాదించారు. యువరాజ్ సింగ్ ఏ పార్టీలో చేరుతారన్న దానిపై ఇంకా అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, మాజీ భారత ఆల్ రౌండర్ రాజకీయాల్లోకి వస్తాడా లేదా అనేది చూడాలి.