Homeహైదరాబాద్latest Newsమేడారం జాతర.. కొన్ని విశేషాలు

మేడారం జాతర.. కొన్ని విశేషాలు

మాఘ శుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే ఘడియలు అసన్నమవుతున్నాయి. ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే దారి తీస్తున్నాయి. వనం జనంతో నిండిపోతోంది. ఇక రేపటి నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది. మేడారం జనగుడారంగా మారి పోయింది. భక్త కోటి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మాఘ శుద్ధ మంచి ఘడియలు వచ్చేశాయి. ఆదివాసీ ఆచార సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే మహా జాతర కోసం మేడారం ముస్తాబయింది. వరంగల్‌కు 110 కిలోమీటర్ల దూరంలో మేడారం కీకారణ్యంలో ప్రతి రెండేళ్లకోసారి ఈ జాతర జరుగుతుంది. ఈ నెల 21 నుంచి 24 వరకు జాతర నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 21వ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజును, తాడ్వాయి మండలం కొండాయి నుంచి గోవిందరాజును గద్దెల పైకి తీసుకు వచ్చి ప్రతిష్టిస్తారు. ఇక 22వ తేదీన సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు.

శుక్రవారం దేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. శనివారం దేవతలు వనప్రవేశం చేస్తారు. ఈ నాలుగు రోజులు మేడారం జనారణ్యంగా మారిపోతుంది. సమ్మక్క, సారలమ్మ ఆగమనంతో మొదలుకొని దేవతలను గద్దెల వద్ద ప్రతిష్టించడం, వన దేవతల పూజలు, వన ప్రవేశం వంటి ఘట్టాలు అత్యంత ఆసక్తికరంగా సాగుతాయి. ఈసారి జాతరకు అన్నీ తానై ఏర్పాట్లు చేశారు స్థానిక మంత్రి, ఆదివాసీ బిడ్డ సీతక్క. ఉచిత బస్సు పథకం తర్వాత పెద్దఎత్తున మహిళలు జాతరకు తరలి వస్తారని అంచనా వేస్తున్నామని, వాళ్లకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ చెప్పారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట బస్సు నిలయంలో మేడారం వెళ్లే భక్తులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. మహా జాతర నేపథ్యంలో భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు, అప్రమత్తతపై పలు సూచనలు చేశారు. చిన్నపిల్లలు, ఆభరణాలు,డబ్బు వంటి విలువైన వస్తువుల సంరక్షణతో పాటు ప్రధానంగా భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలను వారికి వివరించారు. లక్షలాదిమంది తరలివచ్చే మేడారం జాతరకు ప్రైవేటు వాహనాల్లో వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని మేడారానికి వెళ్లే భక్తులకు ఈ సందర్భంగా పోలీసులు , ఆర్టీసీ సిబ్బంది విజ్ఞప్తి చేశారు.

Recent

- Advertisment -spot_img