– ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేసే పార్టీలు కావాలా?
– హామీల అమలు కోసం కొట్లాడే బీజేపీ కావాలా? తేల్చుకోండి
– మోదీని మళ్లీ ప్రధానిని చేసుకుందాం..
– తెలంగాణకు అధిక నిధులు తెచ్చుకుందాం
–ప్రజాహిత యాత్రలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
ఇదేనిజం, కరీంనగర్ ప్రధానప్రతినిధి: ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో 6 గ్యారంటీల అమలు కోసం పోరాడుతున్న బీజేపీ కావాలా? ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ హామీల అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కావాలా? ప్రజలు తేల్చుకోవాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. 6 గ్యారంటీలను అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రభుత్వంపై వివిధ రూపాల్లో ఒత్తిడి తెస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రజాహిత యాత్రలో శుక్రవారం సాయంత్రం హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే ఎన్నికల కోడ్ వస్తుందని, దానికంటే ముందే గ్యారంటీలను అమలు చేసి తీరాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. తాను హామీలను ప్రస్తావిస్తే, కాంగ్రెస్ నేతలు చలో పాలమూరు, రంగారెడ్డి అంటున్నారని, బీఆర్ఎస్ నేతలు చలో మేడిగడ్డ అంటున్నారని ఎద్దేవా చేశారు. నాడు తాము మేడిగడ్డకు వెళితే, మమ్ముల్ని పోలీసులను పెట్టి కొట్టించిన బీఆర్ఎస్ నేతలకు ఇయాళ అదే గతిపట్టిందని చెప్పారు. కాళేశ్వరం పేరుతో దోచుకున్న కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని, కేసీఆర్ కుటుంబ ఆస్తులను ఎందుకు స్వాధీనపర్చుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ అప్పుల నుంచి బయటపడాలంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీకే ఓటేయాలని, మోదీని మళ్లీ ప్రధానిని చేసుకుందామని, తెలంగాణకు అధిక నిధులు తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఈటల రాజేందర్ సోదరుడు ఈటల భద్రయ్య ఆహ్వానం మేరకు స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఈటల నివాసానికి వెళ్లిన బండి సంజయ్ తేనీరు తాగారు.