Homeహైదరాబాద్latest Newsనా పొత్తు జనంతోనే : Jagan Mohan Reddy

నా పొత్తు జనంతోనే : Jagan Mohan Reddy

  • సింహంలా సింగిల్ గానే పోటీ చేస్తాం
  • నోటా కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న పార్టీతో బాబు పొత్తు
  • తన వాళ్లకు సీట్లే ఇప్పించుకోలేని పవన్.. జనానికి ఏం చేస్తాడు
  • బాపట్ల జిల్లా మేదరమెట్ల సిద్ధం సభలో సీఎం జగన్
  • సభలో అపశ్రుతి .. ఇద్దరు దుర్మరణం

ఇదేనిజం, ఏపీ బ్యూరో: తాను జనంతో మాత్రమే పొత్తు పెట్టుకుంటాననని.. ఇతర పార్టీలతో కాదని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబుకు తన బలం మీద నమ్మకం లేకే.. నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో జట్టు కడుతున్నారని ఆరోపించారు. ఏపీలో జరగబోతున్న సంగ్రామంలో పేదవాడికి అండగా నిలిచేందుకు అంతా సిద్ధంగా ఉండాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. జగన్ ను ఓడించేందుకు కూటమి, జగన్‌ను గెలిపించేందుకు మీరు చేస్తున్న పోరాటంలో అంతిమ విజయం తమదేనన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో వైసీపీ ఆదివారం నిర్వహించిన సిద్ధం భారీ బహిరంగ సభలో పొల్గొన్న సీఎం జగన్.. ఎన్నికల కోసం బీజేపీ, జనసేన పార్టీలతో చంద్రబాబు పెట్టుకుంటున్న పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజలతో పొత్తుగా ఎన్నికలకు వెళ్తుంటే, చంద్రబాబు మాత్రం వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాను సింహం అని, సింగిల్ గా ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. జమ్మిచెట్టు మీద దాచిన ఓటు అనే ఆయుధాన్ని బయటకు తీసి, మీ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న వారిపై ప్రయోగించాల్సిన సమయం వచ్చిందన్నారు. చంద్రబాబు వెంట ఉన్నట్లు నటించే పొలిటికల్ స్టార్లు తన వద్ద లేరంటూ పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. తన వాళ్లకు టికెట్లు కూడా ఇప్పించుకోలేని పవన్ కల్యాణ్ .. జనాలకు ఏం చేస్తారని ప్రశ్నించారు.

సిద్ధం సభలో ఇద్దరు దుర్మరణం

వైసీపీ ‘సిద్ధం’ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. తొక్కిసలాటలో పారిశుద్ధ్య కార్మికుడు ఉదరగుడి మురళి (30) మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.ఈ సభకు వెళ్లి వస్తుండగా మరో యువకుడు మృతి చెందాడు. గోపాలపురం మలుపు వద్ద బస్సులో నుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన గేదెల బాలదుర్గగా గుర్తించారు.

Recent

- Advertisment -spot_img