– నిన్న బుజ్జగించిన బీఆర్ఎస్ లీడర్లు
– తాను గులాబీ పార్టీలోనే ఉంటానని ప్రకటించిన ఆరూరి రమేశ్
– బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరు
– మనసు మార్చుకున్న ఆరూరి రమేశ్
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాలు క్షణక్షణానికి వేగంగా మారిపోతున్నాయి. ఆరూరి రమేశ్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి చేరబోతున్నారని నిన్న ప్రచారం సాగిన విషయం తెలిసిందే. దీంతో ఆయనను బీఆర్ఎస్ లీడర్లు పార్టీ మారకుండా ఆపారు. అధినేత కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లి బుజ్జగించారు. తాను బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని బుధవారం ప్రకటించిన ఆరూరి రమేశ్.. గురువారానికి మాట మార్చారు. తాజాగా ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తున్నది. ఏ క్షణమైనా పార్టీ మారే చాన్స్ ఉందని సమాచారం. ఆయన ఏ క్షణంలోనైనా ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఆరూరి విషయంలో బుధవారం హైడ్రామా జరిగిన విషయం తెలిసిందే. బీజేపీలో చేరుతున్నాయనే సమాచారం రావడంతో ఆయన ఇంటికి బీఆర్‌ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సహా పలువురు నేతలు వెళ్లారు. అనంతరం, నాటకీయ పరిణామాల మధ్య ఆరూరిని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. అనంతరం, మాజీ సీఎం కేసీఆర్‌తో ఆరూరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో ఆరూరి మాట్లాడినా ఆయన కాంప్రమైజ్ కాలేదు. దీంతో, ఆరూరి బీఆర్‌ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు. ఆరూరి ఏ క్షణంలోనైనా బీజేపీలోకి వెళ్లే చాన్స్ ఉందని తెలుస్తున్నది.