Homeహైదరాబాద్latest Newsమహిళా ఓటర్లే కీలకం : LokSabha

మహిళా ఓటర్లే కీలకం : LokSabha

– గెలుపోటములను శాసించేది వారే ..
– మెదక్, జహీరాబాద్ స్థానాల్లో మహిళా ఓటర్లే అధికం..
– మహిళా సంఘాలతో ఒప్పందాలకు పార్టీలు రెడీ
– తాయిలాలు ఇచ్చేందుకు.. హామీలు గుప్పించేందుకు సన్నాహాలు

ఇదే నిజం , మెదక్ ప్రధాన ప్రతినిధి: లోక్ సభ ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. వారు ఎవరిని ఆదరిస్తే వారికి విజయం వరించే అవకాశం ఉంది. మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో మహిళా ఓటు బ్యాంకు అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపించనుంది. దీంతో మహిళలు ఏ పార్టీని ఆదరిస్తే ఆ పార్టీ జెండా ఆ లోక్ సభ నియోజకవర్గాల్లో ఎగరనుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 18,12,858 మంది ఉండగా పురుషులు 8,95,777 , మహిళలు 9,16,876 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళా ఓటర్లు 21,099 మంది అధికంగా ఉన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 16,31,561 మంది ఓటర్లకు గాను పురుషులు 7,97,649 మంది , మహిళలు 8,33,849 మంది ఉన్నారు. ఇక్కడ కూడా 36,200 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ లెక్కన రెండు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లదే పైచేయి కానున్నది.

మెదక్ లో 6 , జహీరాబాద్ లో 5 చోట్లా మహిళ ఓటర్లదే ఆధిక్యం

మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే అందులో 11 సెగ్మెంట్లలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళల ఓట్లు ఎవరికి పడితే వారే విజయం సాధిస్తారని నేతలు భావిస్తున్నారు. అందుకే మహిళా సంఘాలు , పొదుపు , స్వయం సహాయక సంఘాల మద్దతును కూడగట్టేందుకు నేతలు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థులను ప్రకటించిన నియోజకవర్గాల్లో మహిళా సంఘాలతో ఒప్పందాలు కుదుర్చుకునే పనిలో నేతలు నిమగ్నమయ్యారు. మహిళలను తమ వైపు తిప్పుకోవడానికి రకరకాల తాయిలాలను ప్రకటిస్తున్నారు. హమీలను గుప్పించేందుకు రెండీ అవుతున్నారు. కాగా మెదక్ లోక్ సభ స్థానం పరిధిలో సిద్ధిపేట , మెదక్ , నర్సాపూర్ , సంగారెడ్డి , దుబ్బాక , గజ్వేల్ అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉంటే , జహీరాబాద్ లోక్ సభ స్థానం పరిధిలో అందోల్ , జహీరాబాద్ , బాన్స్ వాడ , జుక్కల్ , కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

రెండు నియోజకవర్గాలు ఐదు జిల్లాలు

మెదక్ , జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు ఐదు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. మెదక్ ఎంపీ స్థానం మెదక్ , సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నది. ఇక జహీరాబాద్ స్థానం సంగారెడ్డి , మెదక్ , కామారెడ్డి , నిజామాబాద్ జిల్లా పరిధిలో విస్తరించి ఉన్నది. మెదక్ రిటర్నింగ్ అధికారిగా మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ , జహీరాబాద్ రిటర్నింగ్ అధికారిగా సంగారెడ్డి కలెక్టర్ వల్లూరి క్రాంతి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణపై అధికారులు దృష్టి సారించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ను సమర్థవంతంగా అమలు చేసేందుకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎంసీసీ కమిటీలను నియమించి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు.

Recent

- Advertisment -spot_img