Homeహైదరాబాద్latest Newsప్రత్యేకాధికారుల పాలనలో పరేషాన్!

ప్రత్యేకాధికారుల పాలనలో పరేషాన్!

ఇదే నిజం – మెట్ పల్లి రూరల్ : పల్లెల్లో ప్రస్తుతం దోమల బెడదతో జనాలు సతమతం అవుతున్నారు. వేసవికాలం ప్రారంభం కావడంతో పొద్దంతా ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎండాకాలం అరుబయట చల్లని గాలి కోసం కూర్చున్నా దోమల బెడద తప్పట్లేదు. ఇండ్లలో రాత్రి కిటికీలు తెరిస్తే చాలు, దోమలు ఇంట్లోకి చొరబడి రక్తం పీల్చుతున్నాయి.

శివారు ప్రాంతాలు, నాళాలు, చెరువు ప్రాంతాల సమీపంగా నివసించే వారి బాధ వర్ణనాతీతం. రాత్రివేళ వీటి దాడిని తట్టుకోలేక, తలుపులు తెరవలేక ఉక్కపోతతో నరకం అనుభవించాల్సి వస్తుంది. కరెంటు పోతే నిద్రలేమితో ఉండాల్సి వస్తుంది.

గత రెండు నెలల కింద పల్లెల్లో గ్రామ పాలకవర్గం గడువు ముగియడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేక పాలనాధికారిని నియమించినప్పటికీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అన్న చందంగా ఉన్నాయి. మురికి కాలువలు, ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ మందులు పిచికారి చేయాల్సి ఉంది. అదేవిధంగా దోమలు నియంత్రించాలంటే జనావాసాల్లో ఉన్న పశువుల పాకలను తీసివేసేలా చర్యలు తీసుకోవాలి.

గ్రామపంచాయతీల్లో ఫాగింగ్ మిషన్లు ఉన్నప్పటికీ దోమలు బెడద తీర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మిషన్లు మూలనపడ్డాయి. అంతేకాకుండా గ్రామపంచాయతీల్లో జనాభా మరియు వార్డులను అనుసరించి ఫాగింగ్ మిషన్లను పెంచి ప్రతివారం ఉపయోగించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పల్లె జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img