Homeఆరోగ్యంరోజుకు ఒక్క సిగరెట్ తాగితే ఏం జరుగుతుంది?

రోజుకు ఒక్క సిగరెట్ తాగితే ఏం జరుగుతుంది?

ధూమపానం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్‌కు కారకం ప్రాణాంతకం. ఎన్నిసార్లు వినుంటామో ఈ హెచ్చరిక. అయినా లెక్కచేయకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తూ పొగత్రాగేవారు కోకొల్లలు. రోజుకు ఒక్క సిగరెట్ తాగినా కూడా ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు నిపుణులు.

రోజుకు ఒక్క సిగరెట్ తాగితే ఏమైపోతుంది? అని అదే అలవాటును కొనసాగిస్తున్నారు కొందరు. ఒక్క సిగరెట్ పీల్చినా చాలు. మీ శరీరం పై ఎంతో ప్రభావం పడుతుంది. ఇంకా చెప్పాలంటే ఒక్క పఫ్ చాలు, మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడానికి. సిగరెట్ తాగిన వెంటనే మీ శరీరంలో స్వల్పకాలికంగా కొన్ని పరిణామాలు జరుగుతాయి. సిగరెట్ నుంచి పొగను పీల్చుకున్న వెంటనే అది నేరుగా మీ శ్వాసకోశ వ్యవస్థకు చేరుతుంది. అక్కడ ఇబ్బందులు సృష్టిస్తుంది. పొగాకులోని విషపూరిత రసాయనాలు మీ వాయు మార్గాల గోడలను చికాకు పరుస్తాయి. అవి కుచించకుపోయేలా చేస్తాయి. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఆ తర్వాత శరీరం ఈ హానికరమైన పదార్థాలను బయటకు పంపేందుకు ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో దగ్గు ప్రారంభమవుతుంది.

సిగరెట్ కాల్చాక దగ్గు వస్తోందంటే అర్థం శరీరం ఆ రసాయనాలను తట్టుకోలేకపోతోందని. గుండె, రక్తనాళాలకు ధూమపానం వల్ల జరిగే నష్టం చాలా ఎక్కువ. కేవలం ఒక్క సిగరెట్టే కదా అనుకుంటారు… కానీ ఆ ఒక్క సిగరెట్ లో ఉన్న నికోటిన్ మీ రక్త ప్రవాహంలోకి వేగంగా కలిసిపోతుంది. దీనివల్ల గుండె కొట్టుకునే రేటు పెరిగిపోతుంది. గుండె కొట్టుకునే రేటు పెరగడం వల్ల మొత్తం హృదయ నాళ వ్యవస్థ పైనే ఒత్తిడి పడుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు కూడా పెరుగుతాయి. గుండె కోసం మీరు కచ్చితంగా సిగరెట్లు త్యాగం చేయాల్సిందే.

సిగరెట్ లోని పొగలో కార్బన్ మోనాక్సైడ్ అధికంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల్లోని హిమోగ్లోబిన్ తో కలిసి ఆక్సిజన్ ను సులభంగా బంధిస్తుంది. దీనివల్ల అవయవాలు, కణజాలాలకు ఆక్సిజన్ సరిగా అందదు. ఫలితంగా అలసట వస్తుంది. శ్వాస సరిగా ఆడదు. శారీరక శ్రమ చేయలేరు. ధూమపానం వల్ల మెదడు, నాడీ వ్యవస్థ కూడా ఎంతో ప్రభావితం అవుతాయి. పొగాకులో ఉన్న నికోటిన్ మెదడులో డోపమైన్ విడుదలను ప్రేరేపిస్తుంది. అందుకే పొగాకు తాగుతున్న కాసేపు ఆనందంగా అనిపిస్తుంది. ఆ తరువాత మాత్రం చికాకు, ఆందోళన, తలనొప్పులు పెరిగిపోతాయి. కేవలం రెండు నిమిషాల పాటు దొరికే ఆనందం కోసం మిగతా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. సిగరెట్ తాగిన వెంటనే నోటి ఆరోగ్యం పై కూడా ప్రభావం పడుతుంది.

పొగాకులో ఉండే రసాయనాలు మీ నోరు, గొంతులోని సున్నితమైన కణజాలాలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి నోటి దుర్వాసనకు దారితీస్తాయి. చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అలాగే దంతాలపై నల్లటి మరకలు కూడా రావచ్చు. చివరికి నోటిక్యాన్సర్‌కు దారితీస్తుంది. చర్మ ఆరోగ్యం పై కూడా సిగరెట్ ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. పొగాకులో టాక్సిన్స్ ఉంటాయి. ఆ టాక్సిన్స్ శరీరంలో రక్త ప్రవాహానికి చేరుతాయి. చర్మంలో రక్త ప్రవాహం సరిగా జరగకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల చర్మానికి అవసరమైన పోషకాలు, ఆక్సిజన్ అందవు. అలాంటి సమయంలోనే చర్మంపై ముడతలు, గీతలు పడతాయి. రంగు పాలిపోయినట్టుగా మారిపోతుంది. అలాగే మొటిమలు, సొరియాసిస్ వంటి వ్యాధులు రావచ్చు. కాబట్టి రోజుకి ఒకే సిగరెట్ అనుకోవద్దు. ఆ ఒక్క సిగరెట్ చాలు మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడానికి.

Recent

- Advertisment -spot_img