– రాహుల్ గాంధీ ని ప్రధానిగాచూడాలన్నదే కాంగ్రెస్ లక్ష్యం
– తెలంగాణలో 12 పార్లమెంట్ స్థానాలు గెలుస్తాం.
– రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి
ఇదే నిజం, భూపాలపల్లి : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 కు పైగా పార్లమెంటు స్థానాలు గెలుస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు , శాసనసభ వ్యవహారల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశఆరు. ఉగాది సందర్భంగా ఆయన భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ స్వగ్రామంలోని దత్తాత్రేయ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ కు అనుకూలంగా వాతావరణముందన్నారు. ప్రజలందరూ రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు.
శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. 40కోట్ల మహిళలు ఇప్పటివరకు బస్సులలో ప్రయాణం చేశారని ఆయన అన్నారు. కొన్ని గ్రామాల్లో 100% పైగా ఉచిత విద్యుత్తు ప్రజలు వాడుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ అన్ని పథకాలు అందేలా కృషి చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. బడుగు బలహీన వర్గాల కోసం రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో 2023 ఆగస్టు సెప్టెంబర్ మాసంలో వర్షాలు లేకపోవడం వల్ల నీటి లభ్యత లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన మూడు నెలలకే కరవు ఏర్పడిందని ప్రతిపక్షాలు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సంవత్సరంలో పూర్తి చేసి అయిదు మండలాల్లోని 45000 ఎకరాలకు నీరు అందించే కార్యక్రమాన్ని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
పోలీస్ రెవిన్యూ వ్యవస్థలుపారదర్శకంగా పనిచేయాలి
రాష్ట్రంలో పోలీస్ రెవెన్యూ వ్యవస్థలు పారదర్శకంగా పనిచేయాలని మంత్రి సూచించారు. కొంతమంది అధికారంతో పేద వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని, అటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలన్నారు. పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా గడ్డం వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ఆ నియోజకవర్గ ప్రజలను కోరారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కాటారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు విలాస్ రావు, చీమల సందీప్, తదితరులు ఉన్నారు.