Homeహైదరాబాద్latest Newsరేపే లాస్ట్ డేట్

రేపే లాస్ట్ డేట్

TS TET 2024 Updates : తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TS TET 2024) దరఖాస్తు గడువు రేపటితో(ఏప్రిల్ 10) ముగియనుంది. చివరి రోజున అభ్యర్థుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విద్యాశాఖ తెలిపింది. అందుకే అభ్యర్థులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. టీఎస్ టెట్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 27న ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అప్లికేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత…ఏప్రిల్ 15 నుంచి అభ్యర్థుల హాల్‌టికెట్ల జారీ చేయనున్నారు. మే 20వ తేదీ నుంచి జూన్‌ 3 వరకు టెట్‌ పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. జూన్‌ 12న టెట్‌ ఫలితాలు విడుదల చేస్తారు.

11 జిల్లాల్లో టెట్ పరీక్షా కేంద్రాలు
టీఎస్ టెట్(TS TET Application Fee) ఫీజు ఈసారి భారీగా పెంచారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా అప్లికేషన్ ఫీజును రూ. 1000గా చేశారు. రెండు పేపర్లకు రూ. 2 వేలు చెల్లించాల్సి ఉంది. గతంలో రెండు పేపర్లకు రూ.400 చెల్లించేవారు. దరశాస్తు రుసుము ఈసారి రూ.1000లకు పెంచడంతో అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫీజు తగ్గింపుపై ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు రాలేదు. టెట్ పరీక్షల(TS TET) నిర్వహణకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 జిల్లాల్లో టెట్‌ ను నిర్వహించనున్నారు. డీఎస్సీ పరీక్ష రాసేందుకు టెట్ లో అర్హత సాధించాలి. తెలంగాణలో ఉపాధ్యాయుల నియామకానికి డీఎస్సీ నోటిఫికేషన్(TS DSC Notification) విడుదలైన సంగతి తెలిసిందే.

టెట్ పరీక్ష విధానం
టెట్ పేపర్‌-1 కు డీఈడీ(D.Ed) అర్హతతోపాటు జనరల్‌ అభ్యర్థులు ఇంటర్ 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. 2015 లోపు డీఈడీ చేసిన జనరల్ అభ్యర్థులకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు, ఇతరులకు 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి. టెట్‌ పేపర్‌-2కు డిగ్రీ అర్హతతోపాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం మార్కులు, ఇతరులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. 2015 లోపు బీఈడీ చేసిన జనరల్ అభ్యర్థులు 50 శాతం మార్కులు, ఇతరులకు 40 శాతం మార్కులు పొంది ఉండాలి. టీఎస్ టెట్‌(TS TET 2024) లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరును 150 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్‌-1ను ఉదయం 9 నుంచి 11.30 వరకు, పేపర్‌-2ను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహిస్తారు. టెట్ కు డీఎస్సీ(TS DSC 2024)లో 20 శాతం వెయిటేజీ ఇస్తారు. జనరల్‌ అభ్యర్థులు 90 మార్కులు, బీసీలు 75 మార్కులు, ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే టెట్ లో అర్హత పొందవచ్చు.

Recent

- Advertisment -spot_img