ఇదేనిజం, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో నిర్వహించే సలేశ్వరం జాతర ఉత్సవాలకు అనుమతి లభించింది. నల్లమల అభయారణ్యంలో చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని ఏటా ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఏటా లక్షల సంఖ్యలో హాజరై లింగమయ్య స్వామికి మొక్కులు చెల్లించుకుంటుంటారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా అటవీ మార్గం గుండా వెళ్లే భక్తుల వాహనాల నుంచి అటవీశాఖ సిబ్బంది టోల్ రుసుం వసూలు చేయనున్నారు. లారీ, బస్సు, డీసీఎంకు రూ.1000, కారు, జీపు, ట్రాక్టర్ కు రూ.500, ఆటో రూ.300, టూ వీలర్ కు రూ.100 చొప్పున టోల్ రుసుం వసూలు చేయనున్నట్లు అటవీశాఖ డి ఆర్ ఓ రవికుమార్ తెలియజేశారు.