ఇదే నిజం, ఆదిలాబాద్ ప్రధాన ప్రతినిధి/తెలంగాణ బ్యూరో: దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రెండు సమూహాల మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ ఉంటే.. మరోవైపు రాజ్యాంగాన్ని మార్చే సమూహం ఉందని ఆయన తెలిపారు. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణంలో, జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్‌లో జరిగిన జన జాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందన్నారు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే రిజర్వేషన్లను ఎత్తివేయడమే అని ఆయన చెప్పారు. ‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మీ హక్కులను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుంది. పేదలు, వెనుకబడిన వర్గాలు, దళితుల హక్కులను లాక్కోవాలని ప్రయత్నిస్తోంది. ప్రధాని మోడీ తన దోస్తుల కోసం రూ. 16 లక్షల కోట్ల నిధులను మాఫీ చేశారు. ఆ డబ్బుతో 25 కోట్ల మందికి ఉపాధి కల్పించవచ్చు.
పేదల హక్కులను కొల్లగొట్టి.. పెద్దలకు ప్రయోజనం చేకూర్చడమే బీజేపీ పని. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేస్తోంది. కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇచ్చిన హామీలను దేశమంతా అమలు చేస్తాం. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళ అకౌంట్లో ఏడాదికి రూ. లక్ష జమ చేస్తాం. ఇందుకోసం పేదల జాబితాను తయారు చేస్తున్నాం. మోడీ నిరుద్యోగులను పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాన్ని హక్కుగా మారుస్తాం. కేంద్రంలోని 30 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేస్తాం. తెలంగాణలో పోడు భూముల సమస్యను త్వరలోనే తీరుస్తాం. ఉపాధి హామీ కింద రోజుకు రూ.400 రోజు ఇస్తాం. కులగణన చేసి తీరుతాం’అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆదివాసీలు అంటే భూమిపై అన్ని హక్కులున్నవారని రాహుల్ గాంధీ తెలిపారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టే వారి పక్షాన ఆలోచిస్తుందని పేర్కొన్నారు. ఆదివాసీల భూ సమస్యను సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తామన్నారు. ఆశా, అంగన్వాడీ కార్యకర్తల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ రైతులకు రుణమాఫీ చేస్తామంటే ప్రశ్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పెద్దలకు బీజేపీ రుణమాఫీ చేస్తే ఎవరూ అడగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేస్తాం
అలంపూర్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య, రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్య రక్షణ కోసం ఇండియా కూటమి పోరాటం చేస్తోందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తామని ఆయన చెప్పారు. దేశంలో 50 శాతం మంది ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన తరగతుల వారే ఉన్నారని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. అంబేద్కర్, నెహ్రూ, గాంధీలు కృషితో రూపొందించిన రాజ్యాంగ వల్లనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, బహుజనులకు ఉన్న 50 శాతం రిజర్వేషన్‌ను బీజేపీ తీసేయాలని కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా రుణమాఫీ చేస్తా: సీఎం రేవంత్
నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై మాట తప్పమని.. ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. మోడీ, కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ గడ్డపై నుంచే పోరు చేశానన్నారు. గత పదేళ్లు తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుందన్నారు. దేశంలోని సంపదను మోడీ… అదానీ, అంబానీలకు దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. సెమీఫైనల్స్‌లో బీఆర్ఎస్ను ఓడించామని, ఫైనల్స్‌లో బీజేపీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ బలహీన వర్గాల గుండె చప్పుడని.. కాంగ్రెస్ గెలిస్తే ఆయన ప్రధాని అవుతారని రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ ఎంపీగా తొలిసారి ఆడబిడ్డకు చాన్స్ ఇవ్వాలని కోరారు. ఇంద్రవెల్లి అమరవీరుల సాక్షిగా పంద్రాగస్టులోపు రైతు రుణమాఫీ చేస్తానని మరోసారి ఆయన స్పష్టం చేశారు. నిర్మల్ సభలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
కేటీఆర్.. చీర కట్టుకుని బస్సు ఎక్కాలి
ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. చీర కట్టుకుని బస్సు ఎక్కాలని రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘కేటీఆర్ చీర కట్టుకుని బస్సు ఎక్కాలి. ఆయనను టికెట్ అడితే 6 గ్యారంటీలు అమలు కానట్లే. టికెట్ అడగకపోతే గ్యారంటీలు అమలు చేసినట్లే. మీరు చెప్పే మాటల గారడీని రాష్ట్రంలో ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. మూతపడిన సీసీఐ పరిశ్రమను ప్రైవేట్ భాగస్వామ్యంతో తెరిపించి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తాం. ఈ నెల 9లోపు రైతుభరోసా నిధులను ఖాతాల్లో జమ చేస్తాం. ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 5 అమలు చేశాం’అని రేవంత్ రెడ్డి తెలిపారు.