Homeహైదరాబాద్latest Newsఓట్ల సమయంలో..ప్రైవేట్ ట్రావెల్స్ దందా

ఓట్ల సమయంలో..ప్రైవేట్ ట్రావెల్స్ దందా

Idenijam, Webdesk : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు తమ సొంతూళ్లకు బయల్దేరేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపు నెల రోజుల ముందు నుంచే ట్రైన్, బస్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ, ఇండియన్ రైల్వేస్ ప్రత్యేక బస్సులు, రైళ్లు నడుపుతున్నా సరిపోవడం లేదు.

ఈ తరుణంలో కొందరు అక్రమార్కులు ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్తులకు వివిధ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రైవేట్ ఏసీ బస్సు ఛార్జీ కనీసం రూ. 4000 గా ఉన్నట్లు సమాచారం. అంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టలేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరిన్ని ప్రత్యేక సర్వీసులు నడపాలని కోరుతున్నారు.

ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టారీతిన ఛార్జీలు వసూలు చేస్తున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనివెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఓటుకు రూ. 2000 నుంచి రూ.3000 వరకు ఇస్తుండటంతోనే ట్రావెల్స్ యజమానులు ఛార్జీలు పెంచుతున్నట్లు చెబుతున్నా…పండగ వేళల్లో కూడా ఇవే పరిస్థితులు నెలకొంటున్నాయి.

కేవలం ఎన్నికలనే కాదు, ఏ పండగకైనా ప్రజల నుంచి డిమాండ్ వచ్చిందంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్ అధిక మొత్తంలో ఛార్షీలు వసూలు చేస్తూ ప్రయాణికుల నుంచి నోట్లు దండుకుంటున్నాయి. ఈ పరిణామాల్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉంది.

Recent

- Advertisment -spot_img