Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో రజాకార్ ట్యాక్స్..ఆర్ఆర్ ట్యాక్స్​తో పాటు కొత్తగా మరో ‘ఆర్’ : ప్రధాని మోడీ

తెలంగాణలో రజాకార్ ట్యాక్స్..ఆర్ఆర్ ట్యాక్స్​తో పాటు కొత్తగా మరో ‘ఆర్’ : ప్రధాని మోడీ

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ప్రస్తుతం రజాకార్ ట్యాక్స్ మొదలైందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఆర్ఆర్ ట్యాక్స్​తో పాటు కొత్తగా మరో ‘ఆర్’వచ్చి చేరిందన్నారు. మూడో ‘ఆర్’అంటే రజాకార్ ట్యాక్స్ అని ఆయన అన్నారు. హైదరాబాద్​కు ఈ మూడు ట్యాక్స్​ల నుంచి విముక్తి కల్పిస్తానని ఆయన పేర్కొన్నారు. డబుల్ ఆర్ ట్యాక్స్​ అనగానే సీఎం రేవంత్ రెడ్డి ఉలిక్కిపడుతున్నారని మోడీ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందన్నారు. పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం రూ.లక్షల కోట్లు ఇచ్చిందని, ఆ నిధులన్నీ అవినీతి ఏటీఎంలోకి వెళ్లాయని ప్రధాని మోడీ విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం దోచుకుంటోందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కారు.. కాళేశ్వరం పేరుతో లూటీ చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా బీఆర్ఎస్ దారిలోనే వెళ్తోందని విమర్శించారు. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తోందని మండిపడ్డారు. తాను ఎవరి పేరూ చెప్పకపోయినప్పటికీ.. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారని, దీనిని బట్టి ఆ ట్యాక్స్‌ ఎవరు వసూలు చేస్తున్నారో అర్థమవుతోందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నారాయణపేట జిల్లాలో, హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభల్లో మోడీ ప్రసంగించారు.

పాలమూరు సోదర, సోదరీమణులారా..
‘నా పాలమూరు సోదర, సోదరీమణులకు హృదయపూర్వక నమస్కారాలు. జోగులాంబ తల్లి పాదాలకు నమస్కరిస్తున్నా’ అంటూ తెలుగులో మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఎన్నో కష్టాలు పడి తనను ఆశీర్వదించేందుకు వచ్చిన కార్యకర్తలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘మోడీ గ్యారంటీ అంటే.. దేశ అభివృద్ధికి గ్యారంటీ, విశ్వవేదికపై భారత గౌరవానికి గ్యారంటీ, ఇచ్చిన హామీలు నెరవేరతాయన్న గ్యారంటీ. మహబూబ్‌నగర్‌ ప్రాంతాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్‌ నేతలు తమ స్వార్థానికి వాడుకున్నారు. ఈ ప్రాంతానికి కృష్ణా, తుంగభద్ర నదుల ఆశీర్వాదం ఉంది. సాగునీటి ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఇచ్చినప్పటికీ ఈ రాష్ట్రం సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి. కాంగ్రెస్‌ రాకుమారుడు ఎన్నికలు రాగానే విద్వేష విషం చిమ్ముతున్నారు. ఆయన రాజగురువు మనల్ని రంగు ఆధారంగా విభజిస్తున్నారు. శరీర రంగును బట్టి దక్షిణ భారత్‌ వాళ్లు ఆఫ్రికన్లు అని మాట్లాడారు. కాంగ్రెస్‌కు హిందువులు, వారి పండుగలు అంటే ఇష్టం లేదు. హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయాలని కాంగ్రెస్‌ చూస్తోంది. కులాలు, మతాల పేరిట దేశాన్ని విభజించాలని కాంగ్రెస్‌ చూస్తోంది. మతపరమైన రిజర్వేషన్లను అంబేద్కర్‌ కూడా వ్యతిరేకించారు. అలాంటి రిజర్వేషన్లు ఇస్తే.. మతమార్పిడులు పెరుగుతాయి. కాంగ్రెస్‌ అంటే అభివృద్ధి నిరోధకులు, దేశ వ్యతిరేకులు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి’అని మోడీ విమర్శించారు.

ఆ మూడు పార్టీలను జనమే వద్దంటున్నారు..
తెలంగాణకు ఉజ్వల భవిష్యత్‌ ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్, ఎంఐఎం వద్దని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని, బీజేపీ గెలిపించుకోవాలని డిసైడ్ అయ్యారని ఆయన చెప్పారు. దేశంలోని 140 కోట్ల మంది కాషాయ పార్టీని గెలిపించాలని సంకల్పం తీసుకున్నారన్నారు. జూన్‌ 4 తర్వాత భారత విరోధులు పారిపోక తప్పదని మోడీ హెచ్చరించారు. ‘జూన్‌ 4 తర్వాత ఉమ్మడి పౌరస్మృతి వద్దన్నవారు, ఆర్టిక్‌ 370 రద్దు వ్యతిరేకులు పారిపోక తప్పదు. మధ్య తరగతి ప్రజల కలలను బీజేపీ సర్కారు నెరవేరుస్తోంది. పదేళ్లలో ఎన్నో సమస్యలకు ఎన్డీయే ప్రభుత్వం పరిష్కారం చూపింది. డిజిటల్‌ రంగంలో, అంకుర సంస్థల్లో నేడు భారత్‌ సూపర్‌ పవర్‌. దేశాన్ని లూటీ చేయడం, వారసత్వ రాజకీయాలు చేయడంలో కాంగ్రెస్‌ది ట్రాక్‌ రికార్డు. కాంగ్రెస్‌ పాలనలో నగరంలో ఎన్నోచోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. వారి పాలనలో ఎక్కడికెళ్లాలన్నా భయపడాల్సి వచ్చేది. భారతీయుల పట్ల కాంగ్రెస్‌ నేతలు జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ రాకుమారుడి గురువు మనల్ని ఆఫ్రికన్లు అని మాట్లాడారు. దేశాన్ని విభజించి పాలించాలనేది ఆ పార్టీ కుట్ర. శ్రీరామనవమి జరుపుకోవడం కూడా తప్పే అన్నట్లు మాట్లాడుతున్నారు. శ్రీరాముడిని పూజించడం దేశ ద్రోహమా? ‘అహింసో పరమోధర్మో అనేది ఇండియా సిద్ధాంతం. వసుధైక కుటుంబం, బుద్ధం శరణం గచ్చామి.. ప్రజాసేవే భగవాన్‌ సేవ. నరుడే..నారాయణుడు అన్నదే భారత్‌ సిద్ధాంతం. వేల సంవత్సరాల సంస్కృతి రక్షణ భారత్‌ అసలైన సిద్ధాంతం’అని మోడీ పేర్కొన్నారు.

ముక్తి దివస్​ను ఎందుకు నిర్వహంచలేదు?
గత ప్రభుత్వం హైదరాబాద్‌ ముక్తి దివస్‌ను ఎందుకు నిర్వహించలేదని మోడీ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించిందన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఉండకూడదనేది బీజేపీ సిద్ధాంతమని ఆయన తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుందన్నారు. ‘తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని కాంగ్రెస్‌ అంటోంది. రాష్ట్రానికి 4 వందేభారత్‌ రైళ్లు ఇచ్చిందెవరు? తొలి ఎయిమ్స్ ఇచ్చిందెవరు? ఫెర్టిలైజర్స్‌ పరిశ్రమ ఇచ్చిందెవరు? పసుపు బోర్డు ఇచ్చిందెవరు? గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చిందెవరు?’అని మోడీ ప్రశ్నించారు.

Recent

- Advertisment -spot_img