ఎన్నికల సమయం దగ్గర పడింది.. తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్ నగర వాసులు సొంత ఊళ్లకు క్యూ కట్టారు. మే 13న జరిగే ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత ఊరి బాట పట్టారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన వారంతా స్వస్థలాలకు తరలి వెళ్లడంతో శనివారం ఉదయం నుంచే రోడ్లన్నీ రద్దీగా మారాయి.
నేటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో(శనివారం, ఆదివారం సోమవారం పోలింగ్) ఊర్లకు వెళ్లేవారితో పలు టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వైపు వెళ్తున్న వాహనాలు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి చేరుకోవడంతో హైదరాబాద్- విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ శివారు హయత్‌నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. మరోవైపు నల్లగొండ జిల్లా కొర్లపాడు టోల్ గేట్ వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచి ఉన్నాయి.