ఇదే నిజం, వీణవంక: కరీంనగర్ జిల్లాలో BRS కార్యకర్తల ఆగడాలు రోజు రోజుకీ మితిమీరుతున్నాయి. పెన్షన్ విషయంలో తమను ప్రశ్నించిన యువకునిపై BRS కార్యకర్తలు దాడికి దిగిన ఘటన శనివారం నాడు వీణవంక మండలంలోని రెడ్డిపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కట్ట రాకేష్ అనే యువకుడు ఇదే నిజం పత్రికలో విలేఖరిగా పని చేస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన పైడిమళ్ళ శ్రీనివాస్ అనే బి ఆర్ ఎస్ కార్యకర్త 2021లో కట్ట రాకేష్ దగ్గర వికలాంగుడైన అతని తండ్రికి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి 10,000 రూపాయలు తీసుకుని మోసం చేసాడు. ఈ క్రమంలో శుక్రవారం రోజు బి ఆర్ ఎస్ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, వాళ్ళందరి సమక్షంలో అతనిని నిలదీసి అడిగాడు. అవమానానికి గురైన పైడిమళ్ళ శ్రీనివాస్ తర్వాత రోజు ఉదయం బైక్ పై వడ్ల బస్తాలు ఇంటికి తీసుకెళ్తున్న రాకేష్ ని.. అదను చూసి బైక్ పై నుండి కింద పడేసి దాడి చేశాడు. ప్రచారం నిర్వహిస్తున్న బి ఆర్ ఎస్ కార్యకర్తల సమక్షంలోనే కర్రతో చితకబాదాడు. ఎదురుతిరిగి ఆపాల్సిన కార్యకర్తలు చోద్యం చూస్తూ నిలబడ్డారు. అదే సమయంలో ఎన్నికల విధుల్లో ఉన్న హోం గార్డ్ ప్రకాశ్ , ఆయనతో పాటు మరో పోలీస్ సిబ్బంది ఈ సంఘటనని గమనించి ఆపారు. ఈ సంఘటనలో తీవ్ర గాయాలపాలైన యువకుడిని ఆసుపత్రికి తరలించారు.