ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల్లో అద్భుతమైన పోరాటపటిమ ప్రదర్శించిన బీఆర్ఎస్ క్షేత్రస్థాయి శ్రేణులకు, పార్టీ నాయకులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత తిరిగి బలంగా నిలబడి కొట్లాడడం ఆషామాషీ వ్యవహారం కాదని.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన నిబద్ధతతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వెంట నడిచి, ఎన్నికల్లో ప్రజామోదం కోసం నాయకులు, కార్యకర్తలు కొట్లాడిన తీరు అద్భుతమన్నారు. గత 5 నెలలుగా సోషల్ మీడియాలో పార్టీ కోసం పని చేసిన, ప్రతి ఒక్క సోషల్ మీడియా వారియర్స్‌కి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీ శ్రేణులు చేసిన ఈ పోరాటం గొప్ప ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు నిర్విరామంగా పనిచేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు సైతం ట్వీట్ చేశారు.