ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఖమ్మం, వరంగల్, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న చింతపండు నవీన్ కుమార్ కు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రోజురోజుకు డేంజర్ బెల్స్ మోగుతున్నట్టు కనిపిస్తోంది. యువ ఓటర్లు క్రమంగా మల్లన్నకు దూరం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక మల్లన్న మీద బ్లాక్ మెయిలర్ అన్న ఆరోపణ తెరమీదకు రావడం.. గెలిపిస్తే మరో నయీంలా అవతరిస్తాడన్న ప్రచారం సాగుతుండటం మల్లన్నను ప్రమాదంలో పడేస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతపండు.. 2021లో ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రెండో స్థానంలో నిలిచాడు.. కాబట్టి ఈ సారి అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో సునాయాసంగా గెలుస్తానని భావించాడు. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి కనిపించడం లేదు. మల్లన్నకు గోటిచుట్టూ రోకలిపోటులో సొంతపార్టీ, తటస్థులు అందరి నుంచి వ్యతిరేకతే ఎదురవుతోంది. కాంగ్రెస్ కేడర్ పూర్తి స్థాయిలో సహకరిస్తుందా? అంటే డౌటే. ఇక గత ఎన్నికల సమయంలో బీజేపీ సానుభూతిపరులు, తటస్థులు మల్లన్న వైపు నిలిచారు కానీ.. ఈ సారి వారు దూరం జరిగారు. గత ఎన్నికల అనంతరం మల్లన్న మీద వచ్చిన విమర్శలు, ఆరోపణలు అన్నీ ఇన్ని కావు.. మల్లన్న ఓ బ్లాక్ మెయిలర్ అన్న ప్రచారం ముందుగా రాజకీయపార్టీల లీడర్లు, అధికారుల నుంచి మొదలై ఆ తర్వాత సర్వత్రా పాకి పోయింది. ఇక తీన్మార్ మల్లన్న లైఫ్ స్టైల్ మీద కూడా తీవ్రమైన చర్చ జరుగుతోంది. తనను తాను ఓ సామాన్యుడిగా చెప్పుకొనే చింతపండు నవీన్ కుమార్.. దాదాపు 2.25 కోట్ల ఖరీదై కారులో తిరుగుతుండటం.. ఆయన ఎక్కడికి వెళ్లినా భారీ కాన్వాయ్ ఉండటం.. ఆయన ఇల్లు కూడా ఖరీదైనది కావడంతో విమర్శలు వస్తున్నాయి. దీంతో క్రమంగా సామాన్యులు మల్లన్నకు దూరం జరిగారు. ఇక ఆయా రాజకీయపార్టీల్లో మల్లన్న బాధితులు చాలా మంది ఉన్నారు.. అందుకే వారంతా మల్లన్నకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇక వీటికి తోడు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు. అందుకే కాషాయ పార్టీ ఓట్లన్నీ బీఆర్ఎస్ వైపు మల్లుతాయేమోనన్న విశ్లేషణ సాగుతోంది.
బీజేపీ ఓటు ఎవరికి?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ సారి కూడా బీజేపీ ప్రేమేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. కిషన్ రెడ్డి అనుచరుడిగా పేరున్న ప్రేమేందర్ రెడ్డి గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేపోయారు. బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ ప్రేమేందర్ రెడ్డికి ప్రజల్లో పెద్దగా పలుకుబడి లేకపోవడంతో సొంత పార్టీ కేడర్ కూడా ఓటు వేయలేకపోయిందన్న విశ్లేషణలు సాగాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటు ఎవరికి పడుతుందన్నది ఇంట్రెస్టింగ్ మారింది. ఈ సారి బీజేపీ ఓటు కచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థికి పడే చాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న పొలిటికల్ సర్కిళ్లలో సామాన్య ప్రజల్లో పలుచన అయిపోయారు. బ్లాక్ మెయిలర్ ఆన్న ముద్ర బలంగా జనంలోకి వెళ్లింది. దానికి తోడు ఆయనను గెలిపిస్తే మరో నయీంలా తయారవుతాడన్న ప్రచారం ఊపందుకున్నది. దీంతో గ్రాడ్యుయేట్లలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అటు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి మీద సానుకూల పవనాలు వీస్తున్నాయి.
మల్లన్నపై సీపీఎం మండిపాటు
ఇక తీన్మార్ మల్లన్నపై సీపీఎం కార్యకర్తలు మండిపడుతున్నారు. తమను గతంలో తీవ్రంగా దూషించిన వ్యక్తికి తామెందుకు సపోర్ట్ చేయాలన్నది వారి ప్రశ్న. సీపీఎం టాప్ లీడర్లు తమ్మినేని వీరభద్రం, రాఘవులను తీవ్ర స్థాయిలో దూషించాడు మల్లన్న. మై హోమ్స్ అధినేత రామేశ్వర్ రావు దగ్గర తమ్మినేని రూ. 100 కోట్లు తెచ్చుకున్నాడని మల్లన్న ఆరోపించారు. తన లైవ్ షోలలో విపరీతంగా సీపీఎం పార్టీని దూషించాడు మల్లన్న. దీంతో సీపీఎం కార్యకర్తల్లో ఆ ఆగ్రహం చల్లారలేదు. అందుకే మల్లన్నకు సపోర్ట్ చేయాలని పార్టీ నిర్ణయించినా సీపీఎం కార్యకర్తలు, సానుభూతి పరులు మాత్రం మల్లన్నకు ఓటు వేసేందుకు ససేమిరా అంటున్నారట. జాతీయ స్థాయిలో తమకు పొత్తు ఉంది కాబట్టి.. సీపీఎం తప్పనిసరి పరిస్థితుల్లో మల్లన్నకు సపోర్ట్ చేస్తోంది. ఇక పోతే తాము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం తప్ప.. మల్లన్నకు కాదని ఆ పార్టీ అగ్రనేతలు కేడర్ కు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే సీపీఎం ఓటు బ్యాంక్ కూడా తక్కువేం కాదు.. ఆ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మికుల ఓటు బ్యాంక్ గణనీయంగానే ఉంటుంది. ఈ ఓట్లు మల్లన్నకు పడటం డౌటే.
రేవంత్ కూ ఇష్టం లేదా?
మల్లన్న సాగించిన అరాచక, వికృత క్రీడ తప్పుడు ప్రచారంతో ఆయనకు అన్ని పొలిటికట్ పార్టీల్లో శత్రువుల ఉన్నారు. వారంతా ఇప్పుడు ఏకమై మల్లన్నకు వ్యతిరేకంగా పనిచేసే చాన్స్ ఉంది. అసలు మల్లన్నను గెలిపించడం ముఖ్యమంత్రికి కూడా ఇష్టం లేదేమో అన్న డౌట్స్ వస్తున్నాయి. మల్లన్న గతంలో సీఎం రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేశాడు. అందుకే రేవంత్ కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల మీద అంత సీరియస్ గా దృష్టి పెట్టలేకపోతున్నారని తెలుస్తోంది. ఒకవేళ మల్లన్నకు పదవి ఇవ్వాలంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగానో.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగానో ఇచ్చేవారని.. లేదంటే ఏదైనా కీలకమైన కార్పొరేషన్ పదవి ఇచ్చేవారని.. అలా కాకుండా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఎందుకు దించుతున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి.
బీఆర్ఎస్ కు ఎంతో ప్రతిష్ఠాత్మకం
ఇక ఈ సీటును బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. కేటీఆర్ కాలికి బలపం కట్టుకొని మూడు జిల్లాలను చుట్టేస్తున్నారు. ఎక్కడికక్కడ యువతతో సమ్మేళనాలు నిర్వహించి వారికి నిజాలు చెబుతున్నారు. కాంగ్రెస్ హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? తాము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం.. అన్న విషయం విడమర్చి గ్రాడ్యుయేట్ ఓటర్లకు చెబుతున్నారు. రాకేశ్ రెడ్డి వర్సెస్ తీన్మార్ మల్లన్న మధ్య పోటీ ఉంది కాబట్టి.. ఈ ఇద్దరు లీడర్లను పోల్చి చూపిస్తున్నారు.