ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం మరో తొండికి తెరలేపింది. వడ్లకు బోనస్ పేరుతో రైతన్నకు మరోసారి సున్నం పెట్టబోతున్నది. వరి పంటకు రూ. 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాట మార్చింది. ఈ పథకానికి ఓ కొర్రీ పెట్టింది. వరికి బోనస్.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంట్లోని ఓ హామీ. అయితే వడ్లు పండించేవారికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రైతులు కూడా నమ్మారు. కానీ కాంగ్రెస్ మాట తప్పడంతో అన్నదాతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరి పంటకు 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు సన్న వడ్లకే ఇస్తమంటోంది. దీంతో రైతులు మండి పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి లో సన్న వడ్లు అసలే పండవు. అసలు రైతులే పండివ్వరు. ఎందుకంటే ఎండ వేడిమి కి బియ్యం విరుగుతాయి కాబట్టి సన్న రకం వేయరు. ఎక్కడన్నా వేసినా అది అరుదు మాత్రమే. అటువంటప్పుడు లేని సన్న వడ్లకి ఇంక బోనస్ ఎలా ఇస్తారు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సన్నాలకు బోనస్ లోనూ కొర్రీలు
ఇక సన్నాలకు బోనస్ విషయంలో ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతోంది. కేవలం కొన్ని రకాలకు మాత్రమే ఈ బోనస్ ఇవ్వనున్నారు. అది కూడా ప్రస్తుత యాసంగి సీజన్ కు వర్తించదు. వచ్చే ఖరీఫ్ నుంచి మాత్రమే ఈ బోనస్ వర్తించనున్నది. ఇక తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో పెద్దగా సన్న వడ్లు పండవు.
ధాన్యం అమ్మకుండా నిలువు చేసుకున్న రైతులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరికి రూ. 500 బోనస్ ఇస్తుంది కాబట్టి.. రైతులెవరూ తమ ధాన్యాన్ని ఇప్పుడే అమ్ముకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. కానీ అకాల వర్షాలతో కొంత నష్టం వాటిల్లింది. చాలా మంది రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోలేక.. కొంతమంది రైతులకు సంబంధించిన ధాన్యం తడిసిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంబడే మూడు రోజుల్లోనే తడిసిన ధాన్యాన్ని కొంటామని చెప్పిన కాంగ్రెస్ ఆ హామీని కూడా విస్మరించింది.
రైతు భరోసా లోని మిగిలిన గ్యారెంటీలు ఇవ్వరా?
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండో గ్యారెంటీ రైతు భరోసా. ఈ గ్యారెంటీల భాగంగా రైతులకు ఎకరానికి 15,000 ఇవ్వాలి, కౌలు రైతులకు రూ.15,000 ఇవ్వాల్సి ఉంది. రైతు కూలీలకు ఎకరాకు రూ. 12,000 ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ గ్యారెంటీలోని ఏ హామీని రేవంత్ సర్కారు పూర్తి చేయలేదు. పాత పద్ధతిలోనే రైతు బంధు ఇస్తున్నారు.. వరికి
రూ. 500 బోనస్ ఇవ్వలేదు. కౌలు రైతుల జాడలేదు, రైతుకూలీలను పట్టించుకోవడం లేదు.
రైతు బంధు నిర్వీర్యం
ఇక రైతు బంధు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తలో మాట చెబుతొంది. దీంతో రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. రైతు భరోసా విషయంలో ఇటీవల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఈ పథకానికి ఇంకా మార్గదర్శకాలు రూపొందించలేదని చెప్పారు. ఈ సారి కూడా పాత పద్ధతిలోనే రైతు భరోసా అన్నదాతల ఖాతాల్లో వేస్తామని చెప్పారు. పాత పద్ధతిలో అంటే ఐదెకరాలు ఉన్న రైతులకు ఇస్తారా? అన్న విషయంలో క్లారిటీ లేదు. మొత్తానికి రైతు బంధు పథకాన్ని కుదించేస్తారా? అని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.