రోజురోజుకు కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌లో చికెన్ ధరలతో కూరగాయల ధరలు పోటీపడుతున్నాయి. నిన్నటి వరకు కారు చవకగా లభించిన టమాటా ధరలు కూడా మళ్లీ ఆకాశం వైపు చూస్తున్నాయి. రైతు బజారులోనే కిలో రూ. 30 దాటేసింది. బహిరంగ మార్కెట్లలో అయితే, రూ.50 నుంచి రూ.60 వరకు పలుకుతోంది. బీన్స్ అయితే రూ. 200 దాటేసింది. బీరకాయ, సొరకాయ ధరలు కూడా సామాన్యుడికి అందకుండా పోయాయి. రైతు బజార్లలో గుండుబీన్స్ కిలో ధర రూ. 155, గింజ చిక్కుడు రూ. 85, పచ్చకాకర రూ. 55, బెండకాయ రూ. 45, పచ్చిమిర్చి రూ. 50 పలుకుతోంది. బహిరంగ మార్కెట్‌లో కొత్తిమీర చిన్నకట్ట పది రూపాయలకు విక్రయిస్తున్నారు. కూరగాయలు అనుకున్నంత మేర మార్కెట్లకు రాకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. వర్షాలు కురిసి కూరగాయల సాగు పెరిగితే కానీ ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు.