దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి. ఎన్నికలు జరిగిన ప్రతీసారి మార్పు కోరుకుంటోంది. 2008లో డీలిమిటేషన్లో భాగంగా మల్కాజిగిరి కొత్త పార్లమెంట్ నియోజకవర్గంగా పురుడు పోసుకుంది. అప్పటి నుంచి జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు మార్పును ఆశిస్తూ కొత్త వారిని గెలిపిస్తున్నారు. కాగా, ఎన్నికల్లో ఎప్పుడూ ఒకే పార్టీకి మద్దతు తెలపకుండా ప్రజలు తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కొత్త అభ్యర్థికే జై కొడుతున్నారు. అయితే 2009 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వే సత్యనారాయణ 93,226 వేల ఓట్లతో గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసిన చామకూర మల్లారెడ్డి 28,371 ఓట్లతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 10,919 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ 3,91,475 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తరవాత ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి 2019లో, తాజా ఎన్నికల్లో ఈటల రాజేందర్ గెలుపొందడం విశేషం.