హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. నిన్న(జూన్ 5) సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు మెట్రో సేవల్లో అంతరాయం ఏర్పడింది. అమీర్పేట్, ఎర్రమంజిల్ స్టేషన్లలో పలు సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మియాపూర్ – ఎల్బీ నగర్ మార్గంలో రైళ్లు 10 నిమిషాల పాటు ఆగిపోయాయి. సాంకేతిక కారణాలతోనే ఆపినట్లు లోకోపైలట్లు వివరణ ఇచ్చుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా టికెట్లు తీసుకునే దగ్గరే గందరగోళం ఏర్పడింది. ఓవర్స్టేయింగ్ అంటూ ప్రయాణికుల నుంచి రూ.15 చొప్పున హైదరాబాద్ మెట్రో వసూలు చేసింది. స్టేషన్లలో ఎక్కువసేపు ఉండి కాలక్షేపం చేశారని ఆ ఫీజు వసూలు చేశారు.
దీనిపై ఓ నెటిజెన్ సోషల్ మీడియా వేదికగా అధికారులను ప్రశ్నించాడు. ప్రాబ్లమ్ మీరు క్రియేట్ చేసి మాకు ఫైన్ ఎలా వేస్తారంటూ ప్రశ్నించాడు. ఈ పోస్టుకు మిగతా ప్రయాణికులు మద్దతు పలికారు. కామెంట్లతో నిలదీశారు. విషయం వైరల్ అయింది. దీంతో చేసేదేమీ లేక మెట్రో యాజమాన్యం తగ్గింది. క్షమాపణలు కోరింది. వసూలు చేసిన ఫీజును తిరిగి చెల్లించనున్నట్లు వెల్లడించింది. అయితే ఎంతమందికి అధిక ఛార్జీ విధించారు? ఎంతమందికి చెల్లించారు? అనే విషయాలు వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు.