ఎన్డీయే శాసన సభాపక్షనేతగా ఎన్నికై సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏపీ రాజధాని అమరావతి అని చెప్పారు. విశాఖను ఆర్ధిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కర్నూలుని కూడా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కేంద్రం సహకారంతో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు. ఎన్డీయే సభాపక్షనేతగా ఎన్నుకున్నందుకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పుని ప్రజలు ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారన్నారు. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని చంద్రబాబు అన్నారు. పవన్‌కల్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరిచిపోలేనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ‘‘నేను జైలులో ఉన్నప్పుడు పవన్ వచ్చి పరామర్శించారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంది. ఎలాంటి పొరపచ్చాలు లేకుండా కలిసి పనిచేశాం’’ అని చంద్రబాబు తెలిపారు.