ఇదే నిజం, గూడూరు: మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండలం, బ్రాహ్మణపల్లి గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో, పీఈటీగా తప్పుడు ధ్రువపత్రాలతో అధికారులను తప్పుదోవ పట్టించి, ఉద్యోగం పొందిన జాటోతు రజితను వెంటనే విధుల నుండి తొలగించాలని, బ్రాహ్మణపల్లి గ్రామంలో గురువారం రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో, తుడుందెబ్బ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బొల్లి సారయ్య, నాయకులు బత్తుల రామన్న, పూనెం యాకయ్య, ఈసం గణేష్, పూనెం మునేందర్, పూనెం చిన్న వీరస్వామి, పూనెం సురేష్, ఆగబోయిన చంద్రం, పూనెం లోకేష్, రాజు, సాయి, వరుణ్ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. సరైన విద్యఅర్హత పత్రాలు లేకుండా, సరైన వయస్సు లేకుండా ఉద్యోగం పొంది, గత 13 సంవత్సరాల నుండి పాఠశాలలో పీఈటీగా రజిత పనిచేస్తోందని, అధికారులు వెంటనే స్పందించి, సమగ్ర విచారణ జరిపి, ఆమెను వెంటనే విధుల నుండి తొలగించి, ఛీటింగ్ కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పీఈటీ జాటోతు రజితను తొలగించని పక్షంలో, తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అలాగే ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలో చదువుతున్న పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబర్చారని, విద్యాలయ ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయుల కృషితో గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. విద్యాలయ అభివృద్ధికి, విద్యార్థులకు మంచి భవిష్యత్‌ను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు సునీత కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాము కూడా విద్యాలయ అభివృద్ధిలో పాలుపంచుకుంటామని అన్నారు.