Homeహైదరాబాద్latest Newsఇంకా ఆంధ్రా ఆనవాళ్లేనా? సంపూర్ణ తెలంగాణ ఇంకెంత దూరం..!

ఇంకా ఆంధ్రా ఆనవాళ్లేనా? సంపూర్ణ తెలంగాణ ఇంకెంత దూరం..!

  • హైదరాబాద్ పై ఇప్పుడు సర్వహక్కులూ తెలంగాణవే..
  • అయినా ట్యాంక్​ బండ్ పై తెలంగాణ మహనీయుల విగ్రహాలకు స్థానం లేదా?
  • తెలుగు వెలుగుల పేరుతో తెలంగాణకు అన్యాయం
  • కేసీఆర్ ఆనవాళ్లు తుడిచేస్తామంటున్న ప్రభుత్వ పెద్దలు
  • నిజానికి లేకుండా చేయాల్సింది ఆంధ్రా ఆనవాళ్లు
  • క్రీడా మైదానాలకు ఆంధ్రా మహనీయుల పేర్లే..
  • నీళ్లు, నిధులు, నియామకాలే కాదు.. ఆత్మగౌరవమూ ముఖ్యమేనంటున్న తెలంగాణ వాదులు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పోరాటం ప్రపంచచరిత్రలోనే ప్రత్యేకమైనది. ఈ ఉద్యమం జరిగింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం మాత్రమే కాదు ఆత్మగౌరవం కోసం కూడా. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమై పదేండ్లు గడిచిన తర్వాత తెలంగాణ బిడ్డల కలలు సాకారమయ్యాయా? సంపూర్ణ తెలంగాణ వచ్చిందా? అన్న డౌట్స్​ వస్తున్నాయి. ఎందుకంటే ఇంకా అడుగడుగునా ఆంధ్రా లీడర్ల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్​ ఎదుట ఆంధ్రా మహనీయుల విగ్రహాలే కనిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఆంధ్ర మహనీయులు, అక్కడ నేతలకు సంబంధించిన విగ్రహాలే కొలువుతీరాయి. ఇక హైదరాబాద్ లోని ప్రముఖ పార్కులకు ఆంధ్రా లీడర్ల పేర్లే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి ట్యాంక్​ బండ్​ మీదన్న విగ్రహాలను కదిలించలేని పరిస్థితి. కానీ ఇటీవల ఉమ్మడి రాజధాని సమయం ముగిసింది. ఇప్పుడు హైదరాబాద్​ మాత్రమే తెలంగాణకు రాజధాని. దీంతో సంపూర్ణ తెలంగాణ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ వాదులు కోరుతున్నారు.

తుడిచేయాల్సింది ఎవరి ఆనవాళ్లు?
ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి చాలా సందర్భాల్లో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తాను అంటుంటారు. కానీ నిజానికి చెరిపేయాల్సింది కేసీఆర్​ ఆనవాళ్లు కాదు.. ఆంధ్రా ఆనవాళ్లు అని తెలంగాణ వాదులు చెబుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి దాదాపు పదేండ్లు పూర్తయినా.. తెలంగాణ గడ్డ మీద ఇంకా ఆంధ్రా బొమ్మలు ఎందుకు? అన్నది వాళ్ల ప్రశ్న. మన సంస్కృతిని మనం పునర్లిఖించుకుంటున్నప్పుడు.. మన పండగులు, మన ఆచారాలు, మనం జరుపుకుంటున్నప్పుడు.. ఆంధ్రా మహనీయుల బొమ్మలు మనమెందుకు చూడాలన్నదే ప్రశ్న. ఆంధ్రా కళామూర్తులంటే తెలంగాణ బిడ్డలకు గౌరవమే. తమిళనాడుకు సంబంధించిన గొప్ప కవులను.. కన్నడనాట గొప్ప కావ్యాలను రచించిన వాళ్లను.. మరాఠా, హిందీ కవులను గౌరవించినట్టు ఆంధ్రా మహనీయులను కూడా తెలంగాణ బిడ్డలు గౌరవిస్తారు.. కానీ తెలంగాణ లో ఉన్న మహనీయులను పక్కకు పెట్టి మరీ పక్క రాష్ట్ర కళామూర్తుల బొమ్మలు ఇక్కడెందుకు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మిలియన్​ మార్చ్​ ఓ సంచలనం
తెలంగాణ ఉద్యమ సమయంలో 2011 మార్చి 10 న జరిగిన ఈ కార్యక్రమం దేశ చరిత్రలో నిలిచిపోయింది. తెలంగాణ ఉద్యమ తీవ్రతను ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే ఈ సమయంలోనే తెలంగాణ ఉద్యమకారులు ట్యాంక్​ బండ్​ మీదున్న ఆంధ్ర కవులకు సంబంధించిన విగ్రహాలను ధ్వంసం చేశారు. ఇక కేబీఆర్ పార్కు ముందున్న కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. తెలంగాణ కవులకు తగిన గౌరవం ఇవ్వకపోవడంతో వారి ఆగ్రహం ఈ రూపంలో బయటపడింది. తెలుగు వెలుగుల పేరుతో ట్యాంక్​ బండ్ మొత్తాన్ని ఆంధ్రా కవులతో నింపేశారు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్​. కానీ తెలంగాణలో ఎందరో కవులు ఉండగా వారిని పట్టించుకోలేదు. ఆ ఆగ్రహం తెలంగాణ బిడ్డల్లో గూడుకట్టుకపోయింది.

స్వరాష్ట్రం సిద్ధించాక..
ఇక తెలంగాణ స్వరాష్ట్రమై కేసీఆర్​ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే సంపూర్ణ తెలంగాణలో భాగంగా ఆంధ్రా ఆనవాళ్లు మొత్తం చెరిపివేయాలంటూ ఉమ్మడి రాజధాని అడ్డంకికి మారింది. కేసీఆర్​ పాలించిన పదేండ్ల పాటూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. అందుకే ఆయన ట్యాంక్​ బండ్​ మీద ఉన్న విగ్రహాలను కదిలించలేపోయారు. ట్యాంక్​ బండ్​ మీదున్న విగ్రహాలను అక్కడి నుంచి ఏపీకి తరలిస్తామని.. గౌరవప్రదంగా ఏపీ సర్కారుకు లేఖ రాసి వాటిని పంపిస్తామని కేసీఆర్​ చెప్పారు. అయితే ఇప్పుడు హైదరాబాద్​ తెలంగాణకు మాత్రమే రాజధాని. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి పూనుకొని ఈ విగ్రహాలను ఏపీకి పంపించాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు.

మనకులేరా మహాపురుషులు?
తెలంగాణ ప్రాంతం పోరాటాల పురిటిగడ్డ. సాయుధ తెలంగాణ పోరాటం మొదలుకొని.. మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఎందరో త్యాగపురుషులు ఈ గడ్డ మీద నెత్తురు చిందించారు. కవిగాయకవైతాళికులకు తెలంగాణ పుట్టినిళ్లు. కవులు, కళాకారులు, గొప్ప సాహిత్యానికి పేరిన్నికగన్నది ఈ నెల. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ మహనీయులు నిర్లక్ష్యానికి గురయ్యారు. అందుకే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. కుమ్రం భీం వంటి పోరాటయోధులు, రావి నారాయణరెడ్డి వంటి సాయుధ తెలంగాణ పోరాట యోధులు, కాళోజీ, దాశరథి, వట్టికోట ఆళ్వార్ స్వామి వంటి రచయితలు ఈ గడ్డను పునీతం చేశారు. ప్రొఫెసర్​ జయశంకర్​, కొండా లక్ష్మణ బాపూజీ వంటి వారు తమ జీవితం మొత్తం తెలంగాణ కోసం ధారపోశాడు. ఇటువంటి వారిని స్మరించుకోవాలని.. వారి విగ్రహాలకు నివాళి అర్పించాలని తెలంగాణ బిడ్డలు కలగన్నారు. కానీ ఆ కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్​ ఉందన్న కారణం, ఇతర రాజకీయ కారణాలతో నేతలు వీరిని పక్కకు పెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం పూనుకొని వీరి విగ్రహాలు నెలకొల్పాలని తెలంగాణ బిడ్డలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.

కోదండరామ్ నోరెత్తాలె..
ఇక ఉద్యమ సమయంలో జేఏసీకి నాయకత్వం వహించిన ప్రొఫెసర్​ కోదండరామ్​ ఇప్పుడు నోరెత్తాలి అని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి, ఇక్కడి సంస్కృతికి ఏ మాత్రం సంబంధం లేని ఆనవాళ్లు ఇక్కడెందుకు ఉన్నాయన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కోదండరామ్​ లాంటి వారు పూనుకొని విగ్రహాల తొలగింపు విషయంలో ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలన్న డిమాండ్స్​ వినిపిస్తున్నాయి. ఒకవేళ రేవంత్ సర్కారు గనక విగ్రహాల తొలగింపు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే.. ఆంధ్రప్రదేశ్​ సర్కారు ఒత్తిడికి ఆయన తలొగ్గారనే అపవాదు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి రేవంత్ ఏం చేస్తారో.. వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img