- నౌకర్ల గురించి ఎందుకు అడగవు
- నిరుద్యోగుల సమస్యలు పట్టవా?
- సర్కారుకు అంటకాగుతున్నావా?
- తీన్మార్ మల్లన్నకు నిరసన సెగ
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు నిరసన సెగ తగిలింది. యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ సమావేశానికి వెళ్లిన మల్లన్నను బుధవారం నిరుద్యోగులు చుట్టుముట్టారు. ఉద్యోగాల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్న సర్కారుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా? అంటూ నిరుద్యోగులు, బీజేవైఎం కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మల్లన్న చిన్నగా అక్కడి నుంచి జారుకున్నారు. మోతీలాల్ నాయక్ అనే నిరుద్యోగి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ మల్లన్న ఎక్కడ ఉన్నారంటూ నిరుద్యోగులు ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరిలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ఈ సందర్బంగా బీజేవైఎం నేతలు అడ్డుకున్నారు. నిరుద్యోగుల డిమాండ్ల మీద స్పందించాలంటూ మల్లన్నను డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. నిరుద్యోగుల సమస్యలను శాసనమండలిలో ప్రస్తావిస్తానని మల్లన్న వారికి చెప్పారు. అయినా యువత నమ్మలేదు. చివరకు పోలీసులు కల్పించుకుని.. ఆందోళనకారులను చెదరగొట్టారు. ఎంతకు వినకపోవటంతో.. తీన్మార్ మల్లన్న అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు.