పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత జావెలిన్ త్రోయర్, డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సారి రజత పతకంతో సరిపెట్టాడు. దేశానికి మరో బంగారు పతకాన్ని అందించాలని భారీ అంచనాలతో రంగంలోకి దిగిన నీరజ్ చోప్రాకు తీవ్ర నిరాశే ఎదురైంది. గురువారం అర్థరాత్రి జరిగిన పురుషుల జావెలిన్ త్రోయర్ ఫైనల్లో నీరజ్ చోప్రా 89.45 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. దీంతో రజత పతకం సాధించాడు.తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ చోప్రా.. రెండో ప్రయత్నంలో మాత్రం సీజన్ బెస్ట్ 89.45 మీటర్ల దూరం ఈటెను విసిరాడు. మరోవైపు పాక్ జావెలిన్ త్రోయర్ హర్షద్ నదీమ్ 92.97 మీటర్ల దూరం విసిరి ఆల్ టైమ్ ఒలింపిక్ రికార్డు నెలకొల్పి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు.
పారిస్ ఒలింపిక్స్లో జావెలిన్ త్రో ఈవెంట్లో భారత్కు రజత పతకాన్ని అందించిన నీరజ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “దేశానికి పతకం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అయితే నేను ఇంకా నా ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలి. తప్పకుండా దాని గురించి కూర్చుని మాట్లాడుకుందాం. పారిస్ ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు చాలా బాగా ఆడారు. నేను 100% పనిచేశాను” అని చెప్పాడు.