ఇదే నిజం, దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం కొండమల్లెపల్లి మరియు చందంపేట మండలాల పరిధిలో ఉన్న గ్రామలలో మౌలిక సదుపాయాలు గురించి అధికారులతో స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రామాలలో తాగునీటి సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నందున గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు అందించాలన్నారు. గ్రామాలలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు ద్వారా నీటి సరఫరా చేయాలని, గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకులు ద్వారా నీటిని అందించాలని అధికారులు గ్రామాలలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి గ్రామాలలో ఉండే బోర్వెల్స్ హ్యాండ్ పంప్స్ పనితీరు పరిశీలించాలన్నారు. పనిచేయని బోర్వెల్స్ హ్యాండ్ పంప్స్ ను మరమ్మత్తు చేయాలన్నారు. కురుస్తోన్న భారీ వర్షాలు, తుపానుల కారణంగా దోమలు, అంటు వ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మండలంలోని పలు పంచాయతీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టలని అన్నారు. గ్రామాలలో ప్రతి రోజు విధిగా పారిశుధ్య పనులు, ఫాగింగ్ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలాల ఎంపిడిఓ లు, పంచాయతీ సెక్రటరీ లు పాల్గొన్నారు.